JC family into YSRCP: జగన్మోహన్ రెడ్డి విషయంలో జెసి ఫ్యామిలీ వాయిస్ తగ్గడం ఇప్పుడు హాట్ టాపిక్. జెసి ప్రభాకర్ రెడ్డి నోరు తెరిస్తే మావాడు అంటూ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకు పడేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన తాడిపత్రి వైసిపి నేతలపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. అయితే భవిష్యత్తు రాజకీయాలను ఆలోచించి అలా ఆయన తగ్గారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా తన అన్న కుమారుడు జెసి పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు తెరవెనుక మంత్రాంగం జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ సైలెన్స్ మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది. లేకుంటే జెసి హడావిడి వేరేగా ఉంటుందని అనంతపురం రాజకీయ వర్గాల్లో ఒక టాక్.
దక్కని ఎంపీ సీటు..
మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి. అనంతపురం ఎంపీ సీటును ఆశించారు జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి. అయితే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధనతో ఆయనకు మొండి చేయి చూపింది తెలుగుదేశం హై కమాండ్. అంతకుముందు అంటే 2014 ఎన్నికల్లో అస్మిత్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ.. పవన్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఓడిపోయినప్పుడు ఇచ్చారు కానీ.. గెలిచినప్పుడు ఇవ్వలేదన్న బాధ పవన్ రెడ్డిలో ఉంది. పైగా జెసి దివాకర్ రెడ్డి పొలిటికల్ గా అంత క్రియాశీలకంగా లేరు. ఆయన వారసుడిగా ఇటువంటి సమయంలో రాకుంటే ఇబ్బందికరమని పవన్ రెడ్డికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఒకే కుటుంబానికి ఒకటే టికెట్ అంటే మాత్రం ఇబ్బందికరమే. అందుకే తనను అప్రోచ్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
విమర్శలు తగ్గించిన ప్రభాకర్ రెడ్డి..
జెసి ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ గా ఎప్పుడు హీట్ పుట్టిస్తూ వచ్చారు. వైసిపి హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలిచారు. అది మొదలు గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఒకటే టికెట్ అనే నిబంధనను గౌరవించి తన కుమారుడిని మాత్రమే అసెంబ్లీకి పంపించారు. అయితే ఇప్పుడు అన్న కుమారుడు మనసు గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు తగ్గించారన్న టాక్ రాయలసీమలో ఉంది. అయితే ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని చంద్రబాబుతో మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో పవన్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన అంత ఈజీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరరని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన హామీ దక్కితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొంత అడ్డు కట్ట పడవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
స్వతంత్ర భావాలు ఎక్కువ..
అయితే జెసి ఫ్యామిలీ వల్ల చంద్రబాబుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో లేనిపోని ఇబ్బందులు తెస్తున్నారు. అయితే జెసి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం అటు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే జెసి ఫ్యామిలీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ లను వదులుకుంటారా అన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే జెసి ఫ్యామిలీ ఎక్కువగా స్వేచ్ఛతో పాటు స్వతంత్రాన్ని కోరుకుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారి నుంచి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచనతోనే ప్రారంభంలో జెసి కుటుంబాన్ని వైసీపీలోకి ఆహ్వానించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి తప్పకుండా ఆహ్వానిస్తారు. కానీ లాభనష్టాలు అంచనా వేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. దానికి కొంత సమయం పడుతుంది కూడా.