https://oktelugu.com/

Jagan: బడ్జెట్ కోసం గగ్గోలు పెట్టిన జగన్.. అసెంబ్లీకి వస్తారా? లేదా?

ఈ ఎన్నికల్లో కూటమి చాలా రకాలుగా ప్రజలకు హామీ ఇచ్చింది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. అయితే వాటిపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. దానిని తప్పుపడుతూ వచ్చారు జగన్. కానీ ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో జగన్ ఎలా స్పందిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 3, 2024 / 09:49 AM IST

    YS Jaganmohan Reddy

    Follow us on

    Jagan: ప్రజా సమస్యల గురించి చర్చించే వేదిక అసెంబ్లీ. ఒక విధంగా చెప్పాలంటే దేవాలయంగా భావిస్తారు. కానీ అటువంటి అసెంబ్లీ రాజకీయాలకు వేదికగా మారింది. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వ హననానికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ప్రాశస్త్యం దెబ్బతింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో దాని చరిత్ర మసకబారింది. దాని లక్ష్యం పక్కదారి పట్టింది. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 11 నుంచి వారం రోజులు పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాలకు జగన్ వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆ పార్టీకి.175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. దీంతో స్పీకర్ అయిన పాత్రుడు వైసిపి అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. దానిని నిరసిస్తూ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు మాత్రం హాజరయ్యారు. తరువాత రకరకాల కారణాలు చెబుతూ గైర్హాజరయ్యారు.

    *ఈసారి తప్పించుకుంటారా?
    ఇప్పుడు తాజాగా నిర్వహిస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఏపీకి పూర్తిస్థాయి బడ్జెట్ లేదని జగన్ ఓవైపు ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండడంతో హాజరుకావాలని టిడిపి కోరుతోంది. ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానించారు. అయితే జగన్ వైఖరి తెలిసిన వారు ఆయన హాజరు కారని తేల్చి చెబుతున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను గైర్హాజరవుతూ ఢిల్లీలో ధర్నా చేశారు జగన్. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఉద్యమ బాట పట్టారు.

    * ఓటాన్ బడ్జెట్ అందుకే
    కూటమి జూన్ లో అధికారంలోకి వచ్చింది. బాధ్యతలు చేపట్టింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింది. ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఓటాన్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు ఆర్థిక స్థితిగతులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి… బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఇన్ని రోజులు పథకాలకు డబ్బు లేక పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేకపోయారని వైసీపీ విమర్శిస్తూ వస్తోంది.అయితే ఇప్పుడు పథకాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ కు ఒక స్పష్టత వచ్చింది. అందుకే ఈ బడ్జెట్ లో పథకాల గురించి కీలక ప్రకటనలు చేయనున్నారు. అయితే బడ్జెట్ కోసం హైరానా పడిన వైసిపి.. ఇప్పుడు సభకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.