Chandrababu Naidu : ఎంతటి శక్తివంతమైన నాయకుడైనా ప్రజాభిష్టం ముందు శిరసావహించాల్సిందే. వారి ఇష్టాలను గౌరవించాల్సిందే. లేకుంటే ప్రజామోదం దక్కడం చాలా కష్టం. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యహరిస్తే ప్రతికూల ఫలితాలు రావడం ఖాయం. అందుకే కాబోలు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకూ అభివృద్ధి అంటూ నినదించినా.. అది తన విజయానికి అక్కరకు రాదని భావించి కొత్తగా సంక్షేమం బాట పట్టారు. ప్రజలకు ఉచితాలు అందిస్తే రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అవుతుందని వాదించిన ఆయన .. ఏం పర్వాలేదు పథకాలు ఇవ్వొచ్చు అని భావిస్తున్నారు. జగన్ కు మించి సంక్షేమ పథకాలు అమలుచేయనున్నట్టు తెలిపారు. మహానాడు వేదికగా వరాలే ప్రకటించారు.
చంద్రబాబు మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. వారి కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న మహిళలకు నెలకు రూ.1500 అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందించనున్నట్టు తెలిపారు. మహిళలు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇంట్లో చదువుకొనే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహకం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తరహాలో ప్రజల భాగస్వామ్యంతో నిర్దిష్ట కార్యక్రమం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన తొలగింపు.ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.పరిశ్రమలు, కంపెనీలు తేవడం ద్వారా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన. ఇలా చంద్రబాబు వరాలు సాగాయి.
ఇంటింటికీ తాగునీటి కొళాయి కనెక్షన్.రైతు సాయం కింద అన్నదాత పథకం పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు.ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం తరహాలో బీసీ వర్గాల వారిపై దాడులు, అత్యాచారాల నిరోధానికి బీసీల రక్షణ చట్టం. బీసీల అభివృద్ధికి ఏం చేయాలో పార్టీలో అంతర్గతంగా చర్చించి తదుపరి ప్రకటన. చంద్రబాబు చేసిన నిర్థిష్ట ప్రకటన ఇది. మున్ముందు ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు ఉంటాయని సంకేతాలిచ్చారు. అయితే ఇందులో దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలెండర్ల ప్రకటనపై ఎక్కువగా చర్చ నడుస్తోంది.
ఉచితాలకు అభివృద్ధికి అవరోధం అన్న మాట ఇప్పుడు తేలిపోయింది. సంక్షేమ పథకాలు లేనివే ప్రజల మధ్యకు వెళ్లలేమని రాజకీయ పార్టీలు గుర్తించాయి. మొన్నటి వరకూ ఏపీ ఆర్థిక స్థితి శ్రీలంక మాదిరిగా చేరుకుంటుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలో నెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అదే సంక్షేమ బాట పట్టడం ఆశ్చర్యం వేస్తోంది. అయినా తప్పని పరిస్థితి. ఇప్పటికే జగన్ సంక్షేమంలో ముందున్నారు. అవే తనకు రెండోసారి అధికారంలోకి తెస్తాయని నమ్ముతున్నారు. ఈ తరుణంలో రెట్టింపు సంక్షేమం చూపిస్తే కానీ చంద్రబాబుకు వర్కవుట్ అవ్వని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలంటున్న టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో వరాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.