Pawan Kalyan: ఏపీ విషయంలో బిజెపి ప్లాన్ ఏంటి? తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్తుందా? ఒంటరి పోరాటం చేస్తుందా? అన్నది క్లారిటీ లేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే రకమైన ప్రశ్న. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదు. అటు ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న పవన్ బిజెపి తప్పకుండా తమ వెంట వస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవనున్నట్లు తెలుస్తోంది. వారి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఈసారైనా క్లారిటీ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
ఎన్డీఏ లో జనసేన భాగస్వామ్య పక్షం. అయితే జనసేన అధినేత పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమిలోకి బిజెపి వస్తుందని చెబుతున్నారు. నేను ఒప్పిస్తానని.. టిడిపి, బిజెపిని కలుపుతానని ఇన్నాళ్లు చెప్పుకొస్తూ వచ్చారు. కలుస్తాది అనుకుంటున్న బిజెపి నోరు విప్పడం లేదు. కలుపుకొని వెళ్లాలనుకుంటున్న టిడిపి సైలెంట్ గా ఉంది. కానీ పవన్ మాత్రం ఆ రెండు పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది మాత్రం కొలిక్కి రావడం లేదు. బిజెపి ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. రాష్ట్ర బిజెపి నాయకులు ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేయలేదు. హై కమాండ్ మాత్రం పొత్తుకు మొగ్గుచూపడం లేదు. పవన్ కు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది బిజెపియే. ఇప్పటివరకు ఎదిగే ప్రక్రియ ఒక్కటీ ఆ పార్టీకి కలిసి రాలేదు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపితో పవన్ స్నేహం చేశారు. బిజెపి, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతాయని ప్రకటించారు. కానీ అలా వెళ్లిన దాఖలాలు లేవు. ఉమ్మడి కార్యాచరణ అంతకంటే లేదు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయ్యేసరికి నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ పొత్తును ప్రకటించారు. అంతకంటే ముందుగానే చంద్రబాబుతో పలుమార్లు సమావేశమయ్యారు. భాగస్తులైన బిజెపితో ఆతరహా సమావేశం ఒక్కటీ జరగలేదు. మాతో భాగస్వామ్య పార్టీ అయి ఉండి.. టిడిపి తో పొత్తు ఎలా పెట్టుకుంటారని పవన్ ను బిజెపి ప్రశ్నించలేదు. టిడిపి తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడం లేదు. అలాగని టిడిపి ముందుకెళ్లి బిజెపికి స్నేహ హస్తం అందించడం లేదు. కానీ ఆ రెండు పార్టీలను కలిపే బాధ్యతలను పవన్ తీసుకున్నారు. ఈ తరుణంలో ఒక రకమైన అయోమయం నెలకొంది. దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బిజెపి పైనే ఉంది. పొత్తు ఉంటే ఉంటుందని ప్రకటన చేయాలి. లేకుంటే ఒంటరి పోరు ఉంటుందని తేల్చి చెప్పాలి. అలా చెప్పకపోతే మాత్రం ఒక జాతీయ పార్టీగా మూల్యం చెల్లించుకునేది బిజెపియే. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి బిజెపి దారుణంగా దెబ్బతింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పొత్తు అయినా పెట్టుకోవాలి. ఒంటరి పోరుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే ఈసారైనా పవన్ పర్యటనతో ఈ విషయంలో క్లారిటీ వస్తుందో? లేదో? చూడాలి.