AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు కు అందుకే పోస్టింగ్ ఇచ్చారా?

ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారని అభియోగం మోపుతూ ఏబీ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే దీనిని సమర్ధించిన క్యాట్ జీతభత్యాలు ఇవ్వాలని మాత్రం ఆదేశించింది.

Written By: Dharma, Updated On : June 1, 2024 10:39 am

AB Venkateswara Rao

Follow us on

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు కు పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? పదవి విరమణ రోజే ఆయనకు పోస్టింగ్ లభించడం వెనుక లాజిక్ ఏమిటి? రాత్రికి రాత్రే సీన్ మారడం వెనుక జరిగింది ఏమిటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కేవలం టిడిపికి సహకరించారని గత ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర వేధింపులకు గురయ్యారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ విభాగం ఐజిగా ఆయన పని చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టిడిపిలోకి ఫిరాయించడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. అందుకే వైసిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. ఏబీ వెంకటేశ్వరరావును వెంటాడడం ప్రారంభించారు. సుప్రీం కోర్ట్, హైకోర్టు, చివరకు క్యాట్ ఎన్ని రకాల ఆదేశాలు ఇచ్చినా.. లూప్ హోల్స్ వెతుక్కుని మరిఆయనపై సస్పన్సన్ వేటు కొనసాగించారు. కానీ పదవీ విరమణ పొందడానికి గంటల ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. దీని వెనుక పెద్ద కథ నడిచినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారని అభియోగం మోపుతూ ఏబీ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే దీనిని సమర్ధించిన క్యాట్ జీతభత్యాలు ఇవ్వాలని మాత్రం ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వులో ఉంది. అయితే సరిగ్గా ఏబి వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేస్తారనగా.. అదే రోజు కోర్టు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని, ఇవ్వొద్దని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. కోర్టు పిటిషన్ ను కొట్టేయడం, సిఎస్ నియామక ఉత్తర్వులు జారీ చేయడం, సాయంత్రానికి వెంకటేశ్వరరావు గౌరవప్రదమైన రిటైర్మెంట్ తీసుకోవడం స్మూత్ గా జరిగిపోయింది.

అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే సిఎస్ జవహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి వరకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెన్షన్ లో ఉండగా రిటైర్మెంట్ చేయాలని వైసిపి పెద్దలు పావులు కదిపారు. సి ఎస్ పై ఒత్తిడి చేశారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పష్టత రావడం, కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో జవహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో సీఎస్ గా జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన పై అనేక ఆరోపణలు వచ్చాయి. పదవీ విరమణ తర్వాత ఆయనకు చిక్కులు ఎదురు కావడం తప్పదన్నట్టు పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అపవాదును మూటగట్టుకోవడం భావ్యం కాదని సిఎస్ జవహర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో తీసుకున్న నిర్ణయం, సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసుతో వైసీపీలో నిట్టూర్పు మాటలు ప్రారంభమయ్యాయి.అయితే ఏబీ వెంకటేశ్వరరావు విజయగర్వంతోనే పదవీ విరమణ చేశారు. ఇది జగన్ కు చెంప పెట్టే.