YS Jagan: జగన్ విషయంలో వైఎస్సార్ ‘ఆత్మ’ శాంతించలేదు ఎందుకు?

వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. అప్పటికే కేంద్రంలో యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతోంది. వైయస్ మరణంతో పతాక స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో తండ్రి వారసత్వంగా సీఎం పదవిని అడిగారు జగన్. కానీ కెవిపి రామచంద్రరావు వారించారు.

Written By: Dharma, Updated On : July 11, 2024 1:42 pm
Follow us on

YS Jagan: విజయవాడ : జగన్ వెంట కెవిపి రామచందర్రావు ఎందుకు నడవలేదు? జగన్ వద్దన్నారా? కెవిపి వద్దనుకున్నారా? అసలు వారి మధ్య ఏం జరిగింది? పొలిటికల్ సర్కిల్లో ఈ ప్రశ్న ఎన్నడూ వినిపిస్తూనే ఉంటుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కెవిపి రామచందర్రావు ఆత్మీయ బంధువు. సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగా చూసుకునేవారు. వారి మధ్య స్నేహం అలానే ఉండేది. అటువంటిది స్నేహితుడి కుమారుడు వెంట కెవిపి నడవకపోవడం ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోను ఉంది. కానీ దానిని నివృత్తి చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కెవిపి రామచంద్రరావు సైతం మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా.. ఈ విషయంలో మాత్రం దాటవేసే ధోరణితో ముందుకు సాగారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. అప్పటికే కేంద్రంలో యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతోంది. వైయస్ మరణంతో పతాక స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో తండ్రి వారసత్వంగా సీఎం పదవిని అడిగారు జగన్. కానీ కెవిపి రామచంద్రరావు వారించారు. కాంగ్రెస్ రాజకీయాలు తెలుసు కాబట్టి… కాంగ్రెస్ వాది కాబట్టి.. వద్దని జగన్ కు వారించారు.ముందుగా కేంద్రమంత్రి పదవి తీసుకోవాలని.. చివర్లో సీఎం పదవి ఇస్తారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రతిపాదన జగన్ కు నచ్చలేదు. అప్పటి నుంచే గ్యాప్ ప్రారంభం అయ్యింది. జగన్ దూకుడు ఎంతవరకు తీసుకెళ్తుందోనని కేవీపీ సైతం పక్కకు తప్పుకున్నారు.

వైయస్ మరణం తర్వాత సీనియర్ మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను సీఎం చేసింది కాంగ్రెస్ హై కమాండ్. ఆయన పాలన సాగుతున్న తరుణంలో సడన్ గా మార్చింది. అయితే ఆ మార్పు వెనుక రోశయ్య పెట్టిన షరతు ఉంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నామని కాంగ్రెస్ హై కమాండ్ అప్పటికే సంకేతాలు పంపింది. అలా చేస్తే తాను సీఎం గా ఉండలేనని రోశయ్య తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన నాటికి తాను సీఎంగా ఉంటే.. చరిత్ర నన్ను క్షమించదని.. నాకు సీఎం పదవి అక్కర్లేదని రోశయ్య తేల్చి చెప్పారు. రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. చివరి వరకు రాష్ట్ర విభజనను అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు వీలుపడలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కిరణ్ కుమార్ రెడ్డి పై ప్రభావం చూపింది. ఆయన పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీసింది.

అయితే నాడు రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఇందుకు కేవీపీ రామచందర్రావు సైతం మధ్యవర్తిత్వం వహించారు. చివరి రెండేళ్ల పాటు జగన్ ను సీఎం చేస్తామని.. అంతవరకు కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకోవాలని హై కమాండ్ సూచించింది. అప్పటికే రాష్ట్ర విభజన సంకేతాలు రావడంతో చివరి రెండేళ్ల పాటు సీఎంగా పదవి తీసుకునేందుకు జగన్ ఇష్టపడలేదు.తనకు వెంటనే సీఎం పదవి కావాలని పట్టు పట్టారు.కెవిపి రామచంద్రరావు మాట సైతం లెక్క చేయలేదు.నీ అవసరం లేదన్నట్టు మాట్లాడారు. అప్పటి నుంచి సైడ్ అయ్యారు కెవిపి. కాంగ్రెస్ భావజాలంతో ఉండిపోవాలని చూశారు. బిజెపి నుంచి ఆహ్వానాలు ఉన్నా చేరలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. అటువైపు వెళ్లేందుకు కూడా కెవిపి సాహసించలేదు. కానీ ఇప్పుడు షర్మిలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు కెవిపి. అందుకే కెవిపి అంటే వైసీపీ నేతలకు ఒక రకమైన వ్యతిరేక భావన.