Visakha steel plant : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ.. గత కొద్దిరోజులుగా ఈ అంశం అటు దేశం, ఇటు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ కర్మగారాన్ని పరిరక్షించాలని రాజకీయాలకతీతంగా చాలామంది డిమాండ్ చేశారు. వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రస్తుతం సెయిల్(Steel authority of India limited) లో విలీనం చేయాలనే డిమాండ్లు కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గురువారం విశాఖపట్నంలో ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
మన దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత.. దేశీయ అవసరాల కోసం ఉక్కు ను ఉత్పత్తి చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థను స్థాపించింది. దీని పరిధిలో రూర్కెలా, భిలాయి, బొకారో, బర్నపూర్, దుర్గాపూర్ ప్రాంతాలలో పాశ్చాత్య దేశాల సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఉక్కు కర్మాగారాలను నిర్మించింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి, తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతాలలో మూడు ఉక్కు కర్మాగారాలను నిర్మించింది. అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఒడిశా ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. ఆ సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమం పుట్టింది. దాదాపు 32 మంది తమ ప్రాణాలను త్యాగాలు చేసి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. ఆ సమయంలో 64 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇచ్చేశారు. 2002 తర్వాత విశాఖ ఉక్కు కర్మగారం లాభాలను సాధించింది. 2005-06 సంవత్సరంలో ఉక్కు కర్మాగార సామర్థ్యాన్ని 30 లక్షల టన్నుల నుంచి 73 లక్షలకు పెంచారు. భవిష్యత్తు కాలంలో ఈ కర్మగారాన్ని విస్తరించాలనే ఆలోచన వస్తున్న క్రమంలో.. కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయాన్ని తెరపైకి తేవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఉత్పత్తిని పెంచుకుంది. ఏకంగా 58 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించింది. 940 కోట్ల లాభాలను కళ్ల జూసింది. 2022 నుంచి కర్మగారంలో బ్లాస్ట్ ఫర్నెస్ ను నిలిపివేయడంతో.. అది ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించింది. దీనివల్ల 20 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా కర్మాగారానికి సంబంధించిన వ్యయం పెరిగి, నష్టాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో పదోన్నతులను కూడా నిలిపివేయడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారుల పోస్టులు ఖాళీగా మారాయి. ఫలితంగా కర్మాగారాన్ని నిర్వహించేందుకు ఆస్తులు అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది . ప్రస్తుతం కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ప్రకారం ఒక వేళ విశాఖ ఉక్కు కర్మాగారం సెయిల్ లో విలీనం అయితే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తక్కువ పెట్టుబడితో 70 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయవచ్చని కార్మికులు చెబుతున్నారు. సెయిల్ లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేసేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ విలీనం వల్ల దాదాపు 30 వేల కోట్లు ఆదా అవుతాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
సెయిల్ లో విలీనం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కొరత తీరుతుంది. ఉత్పత్తి వ్యయం టన్నుకు కనీసం 6000 రూపాయల వరకు తగ్గుతుంది. ప్రస్తుతం విశాఖ కర్మాగారంలో తయారైన ఉక్కును ఇతర ప్రాంతాలకు తరలించేందుకు విశాఖ, గంగవరం నౌకాశ్రయాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత విస్తరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచొచ్చు. అంతేకాకుండా 10,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచే వాజ్ పేయి, పీవీ నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారానికి తక్షణ సహాయంగా మూడువేల కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను అందించారు. ప్రస్తుతం అంపశయ్య మీద ఉన్న ఉక్కు కర్మాగారానికి అదే స్థాయిలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.