Pawan Kalyan Araku: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) గిరిజనల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ముఖ్యంగా విశాఖ మన్యంలో గిరిజన ప్రాంతాలు అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనుల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించారు. తన సొంత నిధులు వెచ్చించి గిరిజనులకు దుప్పట్లు, పాదరక్షలు.. గిరిజన మహిళలకు చీరలు అందించి వారి పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గిరిజనులు సైతం పవన్ విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు. అభిమానం చూపుతుంటారు. అయితే గిరిజనుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఈనెల ఐదున అరకు ప్రాంతంలో పర్యటించనున్నారు. గిరిజనుల ఆహ్వానం మేరకు మదగడ గ్రామంలో గిరిజనుల సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’ ఉత్సవంలో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
* పురాతన గిరిజన పండుగ..
‘బలి పొరోబ్’ అనేది గిరిజన పురాతన సంప్రదాయ వేడుక. గత నెల 25న ప్రారంభం అయింది. 12 రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలకు గిరిజనులు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పండుగ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పడుతుంది. అయితే సరిహద్దు ప్రాంతంలో జరిగే ఈ వేడుకల్లో ఒడిస్సా కు చెందిన ఆదివాసీలు కూడా పాల్గొంటారు. ఈ వేడుకల ద్వారా రెండు రాష్ట్రాల గిరిజనుల మధ్య సాంస్కృతిక అనుబంధం మరింత బలోపేతం అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
* గిరిజనుల సమస్యలపై ఫోకస్..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొండ శిఖర గ్రామాలకు సైతం రహదారులు ఏర్పాటు చేయాలని భావించారు. అందుకే మొన్న ఆ మధ్యన అరకు,పాడేరు ప్రాంతానికి వచ్చి రహదారులతోపాటు మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన శంకుస్థాపనలు చేశారు. బిజీ షెడ్యూల్లో సైతం రెండు రోజులపాటు అరకు ప్రాంతంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ గిరిజనుల కోరిక మేరకు చాలా గ్రామాల్లో పర్యటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కు సింగపూర్లో ప్రమాదం జరిగింది. ఆ విషయం తెలిసినా.. ఇక్కడి కార్యక్రమాలు ముగించుకుని మాత్రమే ఆయన సింగపూర్ వెళ్లారు. అంతలా గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. తన ఫామ్ హౌస్ లో పండించిన మామిడి పండ్లను సైతం ఇటీవల గిరిజనులకు పంపించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన మామిడి సాగును గిరిజనులు అనుసరిస్తారని భావించి వాటిని అందజేశారు.
* పటిష్ట బందోబస్తు..
గిరిజనుల సంప్రదాయ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకానుండడంతో యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలో పవన్ పర్యటన సమయంలో భద్రత వైఫల్యాలు బయటపడ్డాయి. అందుకే ఈసారి పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా సరిహద్దు ప్రాంతం కావడంతో.. మావోల కదలిక కూడా ఉంటుంది. అందుకే భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.