JanaSena: జనసేన పెండింగ్ స్థానాలకు ఎందుకు అభ్యర్థులను ప్రకటించడం లేదు? ఆ స్థానాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? బిజెపికి ఇవ్వాల్సి ఉంటుందా? సర్దుబాటు ప్రక్రియలోనే పెండింగ్లో పెట్టారా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. కానీ ఇప్పటివరకు 18 మంది అసెంబ్లీ అభ్యర్థులను, ఒక పార్లమెంట్ స్థానం అభ్యర్థిని మాత్రమే పవన్ ప్రకటించారు. మిగతా వాటిని పెండింగ్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించింది. అటు బిజెపి సైతం తమ జాబితాను వెల్లడించింది. జనసేన మాత్రం ఎందుకో జాప్యం చేస్తోంది. సరైన అభ్యర్థులు దొరకలేదనా.. లేకుంటే పొత్తులో భాగంగా బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
జనసేన ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ ఎస్టి రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ టికెట్ కోసం ఆరుగురు నేతలు పోటీపడుతున్నారు. చాలామంది ఔత్సాహికులు సైతం ముందుకు వస్తున్నారు. అందుకే పవన్ పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్ నుంచిముగ్గురు అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కార్పొరేటర్లు కాగా.. మరొకరు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్. ఇటీవలే వైసిపి నుంచి జనసేనలో చేరారు. తనకు జనసేన టికెట్ ఖరారు అయిందని చెబుతూ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం కూడా ప్రారంభించారు.
అవనిగడ్డ సీటుకు సంబంధించి విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండి రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్ఎస్ సర్వేలో విక్కుర్తి శ్రీనివాస్ వైపే మొగ్గు కనిపిస్తోంది. టిడిపి నుంచి మండలి బుద్ధ ప్రసాద్ ను చేర్చుకొని టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఒక్క జనసేన పెండింగ్లో పెట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నాయి. అయితే ఈరోజు కానీ.. రేపు కానీ తుది జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.