Kadapa MLA Reddappagari Madhavi : రాజకీయాలలో కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఇంకా కొన్ని గౌరవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నాయకులకు అనుకూలంగా ఉంటేనే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏది తేడా జరిగినా.. ఎందులో ప్రతికూలత కనిపించినా రాజకీయ నాయకులకు కోపం వస్తుంది. ఆ కోపం కొన్ని సందర్భాలలో తారస్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత అనుకున్నప్పటికీ ఉపయోగము ఉండదు. ఒకప్పుడు ఇటువంటి విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇటువంటి వ్యవహారాలు బయట సమాజానికి క్షణంలోనే తెలిసిపోతున్నాయి.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలను గెలుచుకున్న తర్వాత టిడిపిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు లోకేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతకంటే ముందు 2024 లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో టిడిపి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి జగన్ సొంత జిల్లా కడపలో టిడిపి బలమైన పునాదులను ఏర్పాటు చేసుకుంటున్నది. దానిని పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా మరింత స్థిరం చేసుకుంటున్నది. ఇన్ని సానుకూల పవనాలు.. అనుకూలమైన విషయాలు కనిపిస్తున్న తరుణంలో.. టిడిపి కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవికి కోపం వచ్చింది. ఆ కోపం తారస్థాయికి చేరిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా అలక బూనారు.
శుక్రవారం కడప జిల్లాలో 79 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూక్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిథి సింగ్ హాజరయ్యారు. ప్రోటోకల్ ప్రకారం ఎమ్మెల్యేలకు వేదిక మీద కుర్చీలు ఉండవు. ఆ వేదిక మీద కేవలం మంత్రి, జిల్లా ఉన్నతాధికారులకు మాత్రమే కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అయితే తనకు స్టేజి మీద కూర్చి వేయాలని ఎమ్మెల్యే మాధవి కోరారు. దానికి అక్కడి అధికారులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె అధికారులు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సరైన గౌరవం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పక్కన కుర్చీ ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వేదిక మీదకు వెళ్లకుండా అరగంట పాటు అక్కడే నిల్చున్నారు. కలెక్టర్ చాలా సందర్భాల్లో కోరినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. అలా నిలబడి.. తన నిరసన వ్యక్తం చేశారు. జెండా వందనం పూర్తయిన తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే దీనిపై వైసిపి అనుకూల మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఎమ్మెల్యేకు కనీస వ్యవహారాలు తెలియవని.. ప్రోటోకాల్ గురించి అసలు తెలియదని.. వైసిపి అనుకూల మీడియా తన ప్రచారం చేసిన కథనాలలో స్పష్టం చేస్తున్నది.