Pawankalyan : గొప్ప సంస్కృతి, వారసత్వ సంపదకు భారతదేశం పుట్టినిల్లు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పొందుతున్నాయి. చేనేత వస్త్రాలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయి. అందులో బెనరస్ పట్టు చీరలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. పొందూరు ఖాదీ వస్త్రాలు, ఉప్పాడ పట్టు వంటివి కూడా గుర్తించబడ్డాయి. కానీ ప్రభుత్వాల ఉదాసీనత, నిర్లక్ష్యం, నిరాదరణ వెరసి ఈ చేనేత హస్త కళలు నిర్వీర్యమైపోతున్నాయి. వీటిపై ఆధారపడిన బతుకులు బక్కచిక్కుతున్నాయి. వృత్తి గిట్టుబాటుకాక చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి బాట పడుతున్నారు. ఈ క్రమంలో చేనేతను బతికించే బాధ్యతను జనసేనాని పవన్ తీసుకున్నారు. ఉప్పాడను సిల్క్ సిటీగా ఎంపిక చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ మారుమూల కుగ్రామం ఉప్పాడ. తెలుగు నేతన్నల గొప్పతనాని చాటిచెప్పింది ఈ ఊరు. ఉప్పాడ చేనేతరంగానిది సుదీర్ఘ చరిత్ర. 300 సంవత్సరాల కిందట ఇక్కడ పట్టు చీరల తయారీకి బీజం పడింది. ఇక్కడ నేతన్నలు తయారుచేసే జామ్దానీ చీరలు ప్రపంచ మగువలనే ఆకర్షించాయి. మిగతా పట్టుచీరలకు ఇవి భిన్నం. వెనుక పోగులుగా ఉండకుండా వెనుకా ముందూ ఏ వైపుచూసినా నునుపుగా.. ఒకేలా ఉండడం వీటి ప్రత్యేకత. స్వచ్ఛమైన పట్టుతో చీరలను నేస్తారు. చీర తేలికగా ఉండడంతో అన్నిరకాల డిజైన్లలో ఇవి లభిస్తాయి. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే మగువలు ఎక్కువగా మనసు పారేసుకుంటారు. ఎటువంటి శుభకార్యాల్లోనైనా ఉప్పాడ పట్టు ఉండేలా చూసుకుంటారు.
ఉప్పాడ జామ్ధానీ చీరల తయారీ బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యింది. అప్పటివరకూ ఉప్పాడ నేతన్నలు సంప్రదాయ వస్త్రాలనే నేసేవారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన వీరరాఘవులు అనే నేత కార్మికుడు జామ్దాని చీరల తయారీని పరిచయం చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జామ్దాని పల్లెను ఏర్పాటుచేసింది. అక్కడే పనిచేస్తూ వీర రాఘవులు స్థిరపడ్డారు. అక్కడ రూపొందే చీరలు మొఘల్ మహారాణులు, బ్రిటీష్ దొరసానులను అమితంగా ఆకర్షించాయి. వారు ఇష్టంగా కట్టేవారు. దీంతో వీరరాఘవుల సలహాతో ఉప్పాడ నేతన్నలు వైవిధ్యమైన డిజైన్లతో జామ్దానీ చీరల నేత ప్రారంభించారు. అవి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఉప్పాడ నేతన్నల నైపుణ్యం బయట ప్రపంచానికి తెలిసింది.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఉప్పాడ చేనేత రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కనీస ప్రోత్సాహం అందించడం లేదు. ఉన్న రాయితీలను, ప్రోత్సాహకాలను నిలిపివేసింది. ఈ తరుణంలో వారాహి యాత్ర చేపడుతున్న పవన్ చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతులు, నేతన్న సమస్యలను ఏకరవుపెట్టారు. తమ దయనీయస్థితిని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. వారిని చూసిన పవన్ చలించిపోయారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం వస్తే ఉప్పాడను సిల్క్ సిటీగా రూపొందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచ పటంలో ఉప్పాడ సిల్క్ సిటీని నిలుపుతానని ప్రతినబూనారు. అందుకు చాలారకాల సాధ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ తాజా నిర్ణయంతో పట్టు రైతులు, చేనేత కార్మికులు ఖుషీ అయ్యారు.
Recommended Video:
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Why did pawan choose uppada as silk city what are the possibilities there
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com