MLC Ananthababu  : ఆ వీడియో మార్ఫింగ్.. పోలీసులకు అనంతబాబు ఫిర్యాదు.. సాక్ష్యాలు చూపుతున్న స్థానిక ఎమ్మెల్యే

ఏపీలో మరో ఆసక్తికర అంశంగా ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో మారింది. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కయ్యారు అనంతబాబు. కానీ అందులో ఉన్నది తాను కాదని.. మార్ఫింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది.

Written By: Dharma, Updated On : August 25, 2024 11:02 am

MLC Anandbabu Viral Video

Follow us on

MLC Ananthababu : ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసిపి నైరాశ్యంలో ఉంది. కానీ ఆ పార్టీ నేతల వ్యవహార శైలి హై కమాండ్ కు తలనొప్పిగా మారుతోంది. ఒకవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతోంది. గత రెండు వారాలుగా రచ్చ రచ్చ జరుగుతోంది. చివరకు వైసీపీ స్పందించాల్సి వచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకున్నా.. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించారు. ఆ ఎపిసోడ్ అలా కొనసాగుతుండగా.. మరో ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ బయటపడింది. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అనంత బాబు పై హత్య కేసు ఉంది. ఆ కేసులో బెయిల్ పై ఉన్నారు. అప్పట్లో తన డ్రైవర్ను హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించారు. విధి లేని పరిస్థితుల్లో అరెస్టయ్యారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్నా.. వైసిపి తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఆయనను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడడం వెలుగు చూడడంతో.. అనంతబాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

* స్పందించిన రంపచోడవరం ఎమ్మెల్యే
ఈ ఘటనపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి స్పందించారు. ఆమె ఒకప్పుడు అనంతబాబు బాధితురాలు. అంగన్వాడీ టీచర్ గా ఉన్న శిరీషా దేవిని టార్గెట్ చేశారు అనంతబాబు. ఆమె భర్త టిడిపిలో యాక్టివ్ గా ఉండడంతో.. శిరీషా దేవిని ఉద్యోగం చేయనీయకుండా ఇబ్బంది పెట్టారు. అధికారులపై ఒత్తిడి చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. అయితే అప్పట్లో అధికారులు ఎక్కువగా ఇబ్బంది పడడం చూసిన శిరీషా దేవి ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. టిడిపి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. అనతి కాలంలోనే టిడిపి టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు.

* బయటపడుతున్న అరాచకాలు
అయితే ఇప్పుడు మన్యంలో అనంతబాబు అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా ఈ అసభ్యకర వీడియో బయటకు రావడం పై ఎమ్మెల్యే శిరీషా దేవి స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఎమ్మెల్సీ అలా ప్రవర్తించడం దారుణం అన్నారు. మార్ఫింగ్ అంటున్నారని.. అనంతబాబు మెడలో చైన్, చేతికి బంగారు ఉంగరాలు అలానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తప్పుచేసి మార్ఫింగ్ అనడం సబబు కాదని.. కచ్చితంగా చర్యలకు బాధ్యులు కావాల్సిందేనని స్పష్టం చేశారు.

* గతంలో మాదిరిగా కుదరదు
అయితే ఈ వీడియోలో మార్ఫింగ్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలానే చేశారు. అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రంగంలోకి దిగి అది ఫేక్ వీడియో అని సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ అనంత బాబు విషయంలో అలా జరుగుతుందనుకోవడం తప్పు. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. పోలీసులు పట్టు బిగించి దర్యాప్తు చేస్తే.. అనంతబాబు గుట్టు రట్టు కావడం ఖాయం.