AP Wines Shops : ఏపీలో వైన్ షాపులు ఎందుకు మూతపడ్డాయి? కారణం ఏంటి?

మరో పది రోజుల్లో ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ప్రీమియం బ్రాండ్లు దొరకనున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోమద్యం దుకాణాలు మూతపడడం విశేషం.

Written By: Dharma, Updated On : October 2, 2024 5:37 pm

AP Wines Shops

Follow us on

AP Wines Shops :  ఏపీవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడుతున్నాయి. దీంతో మందుబాబులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి.. వాటి స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేటు దుకాణాలకు సంబంధించి లైసెన్స్ జారీప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. 11న లాటరీ తీసి… షాపులు దక్కించుకున్న వారు 12న వాటిని ప్రారంభించనున్నారు. అయితే అంతవరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఎక్కడికి అక్కడే ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడుతుండడం విశేషం. అయితే ప్రభుత్వం ఈ దుకాణాలను మూసివేయుంచిందా? అధికారులు ఆదేశాలు ఇచ్చారా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా షాపులు మూసివేస్తుండడం విశేషం.

* ప్రభుత్వమే నేరుగా దుకాణాలు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మద్యం పాలసీని ప్రకటించింది. నేరుగా ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని విక్రయించింది. ఇందుకుగాను ప్రతి షాపులో ఇద్దరు సేల్స్ మెన్లు, ఒక సూపర్వైజర్ ను నియమించింది. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం, మద్యం పాలసీని మార్చడం, ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి రానుండడంతో.. సిబ్బంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది. తమ సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరసన బాట కూడా పట్టారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.

* పనిచేయలేమంటున్న సిబ్బంది
వాస్తవానికి వైసీపీ ప్రవేశపెట్టిన మద్యం పాలసీ సెప్టెంబర్ 30తో ముగిసింది. అక్టోబర్ 1న ప్రైవేటు మద్యం షాపులకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ, లాటరీల ద్వారా షాపుల కేటాయింపునకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. అంతవరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమ ఉపాధికి ఎటువంటి హామీ ఇవ్వని ప్రభుత్వం.. తమతో ఎలా పనిచేయించుకుంటుందని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తాము ఈ నెల 12 వరకు పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడుతున్నాయి. దీంతో మందుబాబులకు మద్యం అందకుండా పోతోంది. ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది.