AP Companies: “ఏపీలో పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. విస్తారమైన తీరరేఖ కలిగి ఉన్న నెల్లూరు జిల్లాలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన హై ఎండ్ అల్యూమినియం కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది” ఇదీ వైసిపి మౌత్ పీస్ సాక్షి పేపర్, సాక్షి ఛానల్ లో కనిపించిన వార్త.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
వాస్తవానికి సాక్షిలో కూటమికి అనుకూలమైన వార్త ప్రచురితం కాదు. సాక్షి కక్షతోనే ఈ వార్తను ప్రచురించింది అనుకోవడానికి లేదు. ఉత్కర్ష అల్యూమినియం దాతునిగం లిమిటెడ్ (యూ ఏ డీ ఎన్ ఎల్) పేరుతో 2019లోనే భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయని.. 2020 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నెల్లూరు జిల్లా బివి పాలెం వద్ద 110 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించిందని.. భు కేటాయింపుల్లో ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించలేదని.. వాటిని జగన్ పరిష్కరించారని.. 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిందని.. 2021 జూలై నెలలోనే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని.. నాటి నాల్కో సిఎండి శ్రీధర పాత్ర, మిదాని ఎండి సంజయ్ కుమార్ 2022 ఏప్రిల్ నెలలో నాటి సీఎం జగన్ ను కలిశారని.. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు గానూ ధన్యవాదాలు తెలిపినట్టు సాక్షి రాస్కొచ్చింది.
2019లో ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రిక ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్కర్ష ఆసక్తిని వ్యక్తం చేయలేదని.. నెల్లూరు నుంచి వెళ్ళిపోతోందని వార్తలు రాసింది. చంద్రబాబు ప్రభుత్వం సంస్థకు భూములు కేటాయించి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ అడుగు ముందుకు పడలేదని ఆంధ్రజ్యోతి పేర్కొంది. బొడ్డువారిపాలెం పారిశ్రామిక పార్కులో 2018లో రక్షణ రంగానికి చెందిన పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పాలని మితానీ నిర్ణయించిందని.. నాటి ఉపరాష్ట్రపతి, చంద్రబాబు దీని వెనుక కృషి చేశారని.. 3,100 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దానికోసం 110 ఎకరాల భూమి కూడా అప్పటివరకు కేటాయించిందని ఆంధ్రజ్యోతి రాసింది.
అప్పట్లో ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసింది.. ఇప్పుడు సాక్షి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసింది. స్థూలంగా చూస్తే ఒకటే కంపెనీ.. నాడు జగన్ తరిమేశారని.. ఇప్పుడు చంద్రబాబు తరిమేస్తున్నారని.. ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలకు రెండు బలమైన మీడియా సంస్థలు ఉండడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడింది. వాస్తవానికి కేంద్ర సంస్థ ఏర్పాటు అనేది బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ పరికరాల విషయంలో కేంద్రం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఉన్న సంస్థల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేపడుతోంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఏపీలో కార్యకలాపాలు సాగించాల్సిన అవసరం కేంద్రానికి లేదు.
భూములు తీసుకున్నంత మాత్రాన సంస్థను ఏర్పాటు చేయకుండా కేంద్రం ఊరుకోదు. బలమైన లాబియింగ్ చేస్తేనే సంస్థ ఏర్పాటు అవుతుంది. ఇదే విషయం సాక్షికి అడ్వాంటేజ్ అయింది. వైసిపికి అస్త్రం లాగా మారిపోయింది. కానీ ఇక్కడే కూటమి ప్రభుత్వం తప్పటడుగు వేసింది. అందువల్లే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. సాక్షి రాతలను పట్టించుకోవడం లేదు. ప్రతిపాదిత ప్రాంతంలో కచ్చితంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెబుతోంది. సాక్షి నెల్లూరు ఎడిషన్ లో ఈ వ్యవహారంపై తాటికాయంత అక్షరాలతో వార్త ప్రచురితమైనది. మరుసటి రోజు దీనికి ఎటువంటి ఫాలో అప్ రాకపోవడం విశేషం.