Diversionary politics in AP: ఇటీవల డైవర్షన్ పాలిటిక్స్( diversion politics) అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు, పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నది ఒక వాదన. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే మాట వినిపిస్తోంది. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తరహా విమర్శలు చేసేది. ఇప్పుడు అవే విమర్శలు వైసీపీ నేతలు చేస్తుండడంతో డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి అనే చర్చ ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కూటమి ప్రభుత్వానికి అంత అవసరం ఏమి వచ్చిందన్నది ఒక వాదన. దానికి వైసీపీ నుంచి వస్తున్న కారణాలు.. కాశీబుగ్గ తొక్కిసలాట, తుఫాన్ అని చెబుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఈ తరహా ఆరోపణలు చేశారు.
ప్రైవేటు ఆలయంలో ఘటన..
కాశీబుగ్గ( Kashi Bugga) ఆలయ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యంగా చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భక్తులు భారీగా తరలి వస్తారని తెలిసి పోలీస్ శాఖ నిర్లక్ష్యం చేసింది అన్నది వైసిపి ఆరోపణ. అయితే అది ప్రముఖ దేవస్థానం కాదు. దేవాదాయ శాఖ పరిధిలో లేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణలో లేదు. ఆపై నిర్వాహకులు సైతం తాము పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అంత మంది భక్తులు వస్తారని కూడా అంచనా వేయలేకపోయామని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించింది. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించింది. క్షతగాత్రులతోపాటు తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. మంత్రి నారా లోకేష్ నుంచి మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వరకు అంత శ్రీకాకుళం వచ్చారు. ఆ జిల్లా మంత్రులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాంటప్పుడు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్ట్ జరగడం అని వైసిపి చెప్పడం ఎంతవరకు కరెక్ట్.
ముందే మేల్కొన్న ప్రభుత్వం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అది తీవ్ర వాయుగుండంగా, తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరంపై విరుచుకుపడుతుందని హెచ్చరించింది. అది మొదలు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు హెచ్చరికలు పంపింది. తుఫాను ముందస్తు చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన పనులు కోసం కోటి రూపాయల చొప్పున ప్రతి జిల్లాకు కేటాయించింది. అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ సచివాలయంలోనే గడిపారు. మంత్రి లోకేష్ అయితే రాత్రంతా సచివాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తుఫాను సహాయ చర్యల్లో సైతం ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది. నిత్యవసరాలను పంపిణీ చేసింది. పంట నష్టం నివేదికను తయారు చేసింది. పరిహారం కూడా అందించేందుకు ప్రకటన చేసింది. కానీ తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వం వెనుకబడిపోయిందని.. అందుకే జోగి రమేష్ అరెస్టు జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఆ వాదన సహితుకమేనా?
విపత్తులతో పాటు ప్రమాదాలు చెప్పి రావు. అవి సహజం కూడా. అయితే ఇప్పుడు ఈ రెండు విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమయిందని.. అందుకే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు జరిగిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం విశేషం. అధినేత జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను పరామర్శించలేదు. అంతెందుకు ప్రభుత్వ విధానాలపై వైసీపీ పోరాటాలు, ఆందోళనలు చేసిన సమయంలో అరెస్టు చేసి ఉంటే దానిని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. కానీ విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చక్కగానే పనిచేస్తుంది. ఇటువంటి సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వానికి అవసరమా? అన్నది ప్రశ్న. కానీ ఇప్పుడు వైసీపీ లేనిపోని అంశాలపై పోరాడుతుందే తప్ప.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడం లేదన్నది హైలెట్ అవుతోంది. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం.