Homeఆంధ్రప్రదేశ్‌Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎవరి వాదన నిజం?

Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎవరి వాదన నిజం?

Land Titling Act: ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కుల పై రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్ట్ రూపొందించింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వాస్తవాలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికార పక్షం చెబుతోంది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజం ఎంత? కొత్త చట్టంతో భూ యజమానులకు కలిగే ప్రయోజనం ఏంటి? అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతోనే ఈ యాక్ట్ ను రూపొందించారు. కానీ పూర్తిస్థాయిలో అమలు చేయకముందే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని అధికారపక్షం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ యాక్ట్ అమలు అయితే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే టైటిల్ రిజిస్టర్ అమల్లోకి రానుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా? ఏ వ్యక్తికి చెందినదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది భూ సమస్యల పరిష్కారానికి చక్కటి మార్గమని అధికార పక్షం చెబుతోంది. కానీ విపక్షాలు మాత్రం భూములు బలవంతంగా లాక్కునేందుకేనని ఆరోపిస్తోంది.

వేరువేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలను కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టైటిల్ రిజిస్టర్ నే చట్టపరంగా కంక్లూజివ్ రికార్డుగా చూపుతున్నారు. ఇదే కుదిరికార్డు కిందకు వస్తుంది. అయితే ఈ రికార్డులో తప్పిదాలు ఉన్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే ఒకసారి కంక్లూజివ్ రికార్డు తయారైతే.. దానిపై అభ్యంతరాలు చెప్పడానికి వీలుండదు. అయితే ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు కోర్టుకెళ్లే మార్గం లేకుండా చేశారన్నది విపక్షాల అనుమానం.

అయితే దేశంలోనే తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా ఈ యాక్ట్ ను రూపొందించామని వైసిపి ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల భూ యజమానులకు లాభమే తప్ప నష్టం ఉండదని బలంగా వాదన వినిపిస్తుంది ప్రభుత్వం. అయితే ఈ చట్టం తేవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎంతగానో ప్రయత్నం చేశాయి. కానీ వర్కౌట్ కాలేదు. అయితే అత్యంత క్లిష్ట సమయం, ఎన్నికల సీజన్లో ప్రభుత్వం దీనిని అమలు చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఈ చట్టం అమలు అయితే రాష్ట్రంలో 90 శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. తాము రాత్రికి రాత్రే ఈ యాక్ట్ ను అమల్లోకి తేలేదని… ఎన్నో రకాల అధ్యయనాలు చేసిన తరువాతే చట్టం అమల్లోకి తెచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతోంది. వివాదాస్పద భూముల కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ నమోదు చేస్తామని.. భూ సమస్యల కోసం ప్రయత్నలను ఏర్పాటు చేస్తామని కూడా చెబుతోంది. కానీ విపక్షాలతో పాటు న్యాయవాదులు సైతం దీనిపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట ఇదో వివాదాస్పద అంశంగా మారింది. వైసిపి పై ప్రతికూలత చూపుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular