AP Elections 2024: ఏపీలో ఎవరు గెలుస్తారు?

పోలింగ్ ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి అనేక రకాల ఎత్తుగడలు జరిగాయి.

Written By: Dharma, Updated On : May 14, 2024 11:32 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీ అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో 82 శాతం నమోదయింది. అర్ధరాత్రి వరకు ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మరోవైపు హింసాత్మక ఘటనలు సైతం జరిగాయి. అయితే పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలం అంటే.. తమకు అనుకూలమని అధికార,విపక్షాలు చెప్పుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో సైతం దీనిపైనే రచ్చ నడుస్తోంది. గెలుపు మాదంటే మాది అని వైసిపి సోషల్ మీడియా.. ఇటు టిడిపి సోషల్ మీడియా హోరెత్తిస్తున్నాయి.

ముందుగా అధికారపక్షం వైసిపి సోషల్ మీడియా అతిగా విశ్వసిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం అంటూ ప్రచారం ప్రారంభించింది. ప్రజలు సంక్షేమ పథకాలకు ఇష్టపడి.. జగన్ ను రెండోసారి అధికారంలోకి తేవాలని బలంగా ఆకాంక్షించారని.. దాని ఫలితమే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. వైరల్ చేశాయి. మరోవైపు టిడిపి కూటమి పార్టీలు సైతం గెలుపు పై విశ్వసిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం విశేషం. బై బై జగన్.. ఇక సెలవు.. అంటూ జగన్ ఫోటోలను పెడుతూ.. పక్కనే కూర్చుని జత చేస్తూ.. పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిలువుటద్దం పోలింగ్ శాతం పెరగడానికి కారణమని విపక్ష టిడిపి సోషల్ మీడియా ప్రచారం చేయడం విశేషం.

అయితే పోలింగ్ ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి అనేక రకాల ఎత్తుగడలు జరిగాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున వచ్చారని, వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారని, మధ్యాహ్నం 12 గంటల నుంచి పడిన ఓటింగ్ లో ఎక్కువ శాతం వైసీపీకే పోల్ అయినట్లు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేసుకుంటుంది. అదే సమయంలో యువత, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు, వ్యాపారస్తులు, అర్బన్ ఓటర్లు టిడిపి కూటమి వైపు మొగ్గు చూపినట్లు మూడు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికైతే ఏపీలో గెలుపు పై ఆయా పార్టీల కంటే.. సోషల్ మీడియా విభాగాలే రచ్చ చేస్తున్నాయి.