Who is Chintalapudi Ashok Kumar: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా టిడిపికి చెందిన బలమైన నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. అటువంటి చోట ఆర్థికంగా బలమైన నేతలను, సామాజిక వర్గ పరంగా పేరు మోసిన నాయకులను బరిలో దించాలని భావిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టి మరి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపు మూడున్నర సంవత్సరాలకు పైగా గడువు ఉండడంతో ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా టిడిపికి చెందిన బలమైన నేతల నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు గట్టి సవాల్ విసిరారు. అక్కడ ఓ యువ డాక్టర్ను రంగంలోకి దించారు. ఆయనకే బాధ్యతలు అప్పగించారు.
ప్రకాశం జిల్లాలో కీలకం..
అద్దంకి( addanki) నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కీలకం. అక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఈ తరుణంలో గత రెండు దశాబ్దాలుగా అక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు గొట్టిపాటి రవికుమార్. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే గత ఐదు ఎన్నికల్లో ఆయనపై ప్రత్యర్ధులు మారుతున్నారే తప్ప.. ఆయన గెలుపును మాత్రం నియంత్రించలేకపోతున్నారు. 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవికుమార్. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయాన్ని అందుకున్నారు. అక్కడకు కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లోను గెలవడంతో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ను పడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేత కరణం బలరాం కుటుంబాన్ని బరిలో దించుతారని అంతా అంచనా వేశారు. కానీ ఓ యువ డాక్టర్ను రంగంలోకి దించడం విశేషం.
డాక్టర్ గా సుపరిచితం..
అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్( Chintalapudi Ashok Kumar ) నియమితులు అయ్యారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన డాక్టర్ అశోక్ కుమార్ 2024 ఎన్నికల కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు కు చెందిన అశోక్ కుమార్ గత కొద్దిరోజులుగా డాక్టర్ గా సేవలందిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అయితే అద్దంకిలో ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన ఫలితం దక్కడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ అయిన అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అక్కడ గొట్టిపాటి రవికుమార్ పట్టు సాధించారు. మరి ఆయన విజయాన్ని ఈ యువ డాక్టర్ ఎంత మేర అడ్డుకోగలరో చూడాలి.