Pawan Kalyan Criticism: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శలపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అది కాంగ్రెస్ కోవర్టుల రాజకీయమా అన్నది తెలియడం లేదు. ఏపీ ప్రజలతో పాటు నేతలను దూషించిన వారు మౌనంగా ఉన్నారు. కానీ ఒకేసారి కాంగ్రెస్ నేతలు కట్ట కట్టుకుని వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడో వారం రోజుల కిందట పవన్ కళ్యాణ్ కోనసీమ అంబేద్కర్ జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యను పట్టుకొని ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఖండిస్తే దానికి ఒక సహేతుకమైన కారణం అనిపిస్తుంది. కానీ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తరువాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులు విమర్శలు చేశారు.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
* ఆలస్యంగా స్పందన వెనుక..
వారం రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు మరుగున పడిపోయాయి. తెలంగాణ సమాజం సైతం పట్టించుకోలేదు. అయినా సరే కాంగ్రెస్ నేతలు వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారంటే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనేది అర్థం కావడం లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన స్థితిలో ఉంది కదా అని అనుకుంటే ఆ పార్టీ పతనస్థితిలో ఉంది. పైగా పొరుగు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్న నేత, ఆపై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పై ఇలా విమర్శలు చేస్తుంటే దాన్ని దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కీడును కోరుకునేవారు ఇటువంటి వాటి వెనుక ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పైగా ఎంతో స్వేచ్ఛతో మాట్లాడే తెలంగాణలో.. ఆపై ఏపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఇలా వ్యవహరించడం మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
* ఒకే సామాజిక వర్గం నేతలు..
పవన్ పై ఒకే సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ( Telangana) నేతలు మాట్లాడేసరికి ఏదో దీని వెనుక ఉందని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత కాంగ్రెస్ బీసీ నేతలు లైన్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయేందుకు పవన్ గట్టిగానే కృషి చేశారు. జగన్ పై అభిమాన ఉన్న నేతలు చాలామంది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతో వారు పవన్ కళ్యాణ్ పై అసహనంతో ఉన్నారు. అందుకే పవన్ విషయంలో అలా చేస్తున్నారు అని ఒక మాట కూడా వినిపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ కు ఏమీ జరగదు కానీ.. జరిగితే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరగాలి.