https://oktelugu.com/

AP Nominated Posts : నామినేటెడ్ జాబితాతోపాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు.. చివరకు ఆయనకే ఛాన్స్

కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. పాలనను మరింత పరుగులెత్తించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం చేపడతారని తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 19, 2024 / 08:18 PM IST

    AP Nominated Posts,

    Follow us on

    AP Nominated Posts : ఏపీ సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ పోస్ట్ పై దృష్టిపెట్టారు. నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందన్న నేపథ్యంలో.. టీటీడీ ట్రస్ట్ బోర్డును సైతం భర్తీ చేయాలని చూస్తున్నారు. దీనిపై కసరత్తు కూడా ప్రారంభించారు. నామినేటెడ్ పదవుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదివరకే నామినేటెడ్ పోస్టుల తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 కార్పొరేషన్లకు సంబంధించి.. దాదాపు 100 మందితో కార్యవర్గాలను ప్రకటించారు. ఇందులో చైర్మన్లుగా 16 మంది టీడీపీ,ముగ్గురు జనసేన, బిజెపిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. 99 మంది డైరెక్టర్లను నియమించారు. అయితే టీటీడీ ట్రస్ట్ బోర్డు నియమిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి.. క్యాబినెట్ హోదా తో సమానమైనది. అందుకే ముఖ్యమంత్రులు తమ అస్మదీయులకు ఈ పదవి అప్పగిస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి ఆ పదవి ఇచ్చారు. చివరి ఎన్నికల ఏడాది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేశారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.. ట్రస్ట్ బోర్డు నియామకం చేపట్టకపోవడం విశేషం.

    * అవినీతి విమర్శలు లేకుండా
    అవినీతి మరకలేనటువంటి.. రాజకీయ విమర్శలు ఉండని వ్యక్తులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీలో రాజకీయ జోక్యం పెరగడంపై భక్తులు ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాజకీయ పార్టీల నేతలను నియమిస్తే ఎటువంటి పరిస్థితి వస్తుందోనన్న ఆందోళన ఉంది. అయితే టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవి గురించి మూడు పార్టీల నుంచి వినతులు ఉన్నాయి. దీంతో పదవి విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

    * ఆ ఇద్దరిలో ఒకరికి
    మరో రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా టీటీడీ ట్రస్ట్ బోర్డును సైతం నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఏపీకి చెందిన ఓ మాజీ న్యాయ కోవిదుడు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితే పారదర్శకంగా సేవలు అందిస్తారని భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ జరిగిన వివాదాస్పద విషయాల నేపథ్యంలో.. సదరు న్యాయ కోవిదుడు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర మాజీ మంత్రి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న అశోక్ గజపతిరాజు అయితే ఆ పదవికి సరిపోతారని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.