https://oktelugu.com/

Chandra Babu : శ్వేతపత్రాల ఎఫెక్ట్.. ఢిల్లీకి వైసీపీ నేతల క్యూ.. చంద్రబాబు మేల్కొనకుంటే ముప్పే!

వైసిపి హయాంలో చాలామంది కీలక నేతలపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ శ్రేణులే వారిపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయడంతో.. తమపై ప్రాథమిక దర్యాప్తు చేశారని వైసీపీ నేతలు ఒక అంచనాకు వస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2024 / 04:12 PM IST
    Follow us on

    Chandra Babu :  వైసీపీ సర్కార్ అవినీతిని చంద్రబాబు ఎండగడుతున్నారు.గత ప్రభుత్వం హయాంలో జరిగిన దోపిడీని, అవినీతి, అక్రమాలను బయటకు తీస్తున్నారు. వరుసగా శ్వేత పత్రాలను విడుదల చేస్తూ..వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేశారు. చివరిగా నిన్న భూదోపిడి పై విడుదల చేసిన శ్వేత పత్రంతో వైసీపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారు. తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    వైసిపి హయాంలో చాలామంది కీలక నేతలపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ శ్రేణులే వారిపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయడంతో.. తమపై ప్రాథమిక దర్యాప్తు చేశారని వైసీపీ నేతలు ఒక అంచనాకు వస్తున్నారు. అందుకే తమ అరెస్టులు ఉంటాయని అనుమానిస్తున్నారు. కేసులతో వెంటాడుతారని కూడా భావిస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే అటువంటి నేతలు విషయంలో చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దూకుడుగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన నేతలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్తారు. అన్ని జిల్లాల నాయకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    జనసేన కూడా ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని చూస్తోంది. అయితే అది చేరికల ద్వారా కాకుండా.. సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాటం వంటి వాటితో సాధించాలని చూస్తోంది. ఎన్నికలకు ముందు కొంతమంది జనసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రకరకాల ఆరోపణలు చేశారు. పార్టీపై బురదజల్లారు. అయినా సరే ప్రజలు జనసేన ను ఆదరించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు. పోటీ చేసిన 21 స్థానాల్లో సంపూర్ణ విజయం కట్టబెట్టారు. అందుకే ప్రజలతో మమేకమై పని చేయాలని జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించవద్దని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    అయితే వైసీపీ నుంచి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలకు బిజెపి కనిపిస్తోంది. అందుకే వైసీపీ నేతలు ఢిల్లీలో వాలిపోతున్నారు. తెలిసిన నేతలను పట్టుకొని వారి సహాయంతో పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోకపోతే.. ఆయన విడుదల చేస్తున్న శ్వేత పత్రాలకు విలువ ఉండదు. ఆ శ్వేత పత్రాలతో వైసిపి నేతల అవినీతిని బయట పెడుతున్నారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే నేరుగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. బిజెపిలో చేరేందుకు సిద్ధపడి పోతున్నారు. అయితే భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం అభిప్రాయం కొనుక్కోవాల్సిన అవసరం ఢిల్లీ పెద్దలపై ఉంది. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అమిత్ షా తో ఇదే విషయం ప్రస్తావిస్తారని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. అవినీతిఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని,తమను సంప్రదించిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు సూచించే అవకాశం ఉంది.

    అయితే వైసిపి నేతలను బిజెపిలో చేర్పించేందుకు.. కొంతమంది బిజెపి రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి తో పొత్తు ఇష్టం లేని చాలామంది నేతలు ఈ ఎన్నికల్లో సైలెంట్ అయ్యారు. వారికి పెద్దగా ప్రాధాన్యం కూడా దక్కలేదు. కానీ టిడిపి అనుకూలురు అని ముద్రపడిన నేతలకు మాత్రమే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే టిక్కెట్లు ఆశించిన బిజెపి సీనియర్లు చాలామంది ఇప్పుడు పావులు కదపడం ప్రారంభించారు. వైసీపీ నేతలను బిజెపిలోకి తెప్పించి.. ఏపీలో వైసీపీ అండతో అసమ్మతి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వారి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.