https://oktelugu.com/

CM Chandrababu : అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు ఢిల్లీ సడన్ టూర్.. కారణమేంటి?

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు మంజూరవుతున్నాయి. ముఖ్యంగా అమరావతికి కీలక ప్రాజెక్టులు దక్కుతున్నాయి. ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2024 4:19 pm
    Chandrababu Delhi Tour

    Chandrababu Delhi Tour

    Follow us on

    CM Chandrababu :  ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనెల 22 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ఈనెల 18న మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నారు. ఇటువంటి కీలక సమయంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. ఏపీకి రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు చంద్రబాబు ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం.అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. తెర వెనుక రాజకీయ అంశాలు ఏవైనా ఉన్నాయా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

    * కేంద్రం ప్రత్యేక ఫోకస్
    ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం సైతం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయిస్తూ వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధానికి సంబంధించి రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను సైతం కేటాయించింది కేంద్రం. అన్ని విషయాల్లో ఉదారంగా ఆదుకుంటోంది. మరోవైపు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కూడా సానుకూలంగా ఉంది. అయితే వీటితోపాటు అదనపు ప్రాజెక్టుల విషయం చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

    * ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం
    అమరావతిలో ఇటీవల సిఆర్డిఏ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు చంద్రబాబు. తద్వారా రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించినట్లు అయ్యింది. ఒకవైపు అమరావతి పనులు చేపడుతూనే.. సమాంతరంగా కేంద్ర ప్రాజెక్టుల సైతం పట్టాలెక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి భూమి పూజ చేసేందుకే ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించునున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.