Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నష్టాలను కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఈలోపు ఎన్నికలు రావడం.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోవడంతో కేంద్రం వెనకడుగు వేసింది. అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వాస్తవానికి అప్పట్లో చేతినిండా ఎంపీలు ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార వైసిపి ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందువల్లే మొన్నటి ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కూటమి భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కూటమి ఎంపీల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలిచిపోతుందని కార్మికులు మొన్నటిదాకా భావించారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్న సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కుమారస్వామి గురువారం విశాఖ ఉక్కు కర్మాగారం లో పనిచేసే కార్మికులతో చర్చలను మొదలుపెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీ కి ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల నుంచి వచ్చిన నిరసన, కార్మికుల నుంచి వచ్చిన ఆగ్రహం కారణంగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. మళ్ళీ ఎన్ని రోజులకు విశాఖ కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి కుమారస్వామి కార్మికులతో చర్చలు జరుపుతున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికులు ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. “32 మంది తమ ప్రాణాలను త్యాగం చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఒడిశా వెళ్లకుండా అడ్డుకున్నారు. 64 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఇచ్చేశారు. ఇంతటి త్యాగ చరిత్ర ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మా జీవనాధారం మొత్తం పోతుంది. మా ఉపాధి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకా 32 మంది ప్రాణ త్యాగం చేసింది? ప్రైవేట్ కంపెనీ లాభాలు పొందేందుకా 64 గ్రామాల ప్రజలు ఇరవై రెండువేల ఎకరాలు ఇచ్చింది?” అని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోకి చేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సెయిల్ పరిధిలోకి విశాఖ ఉప కర్మగారం వెళ్తే.. 70 లక్షల టన్నుల ఉక్కును ప్రతి ఏడాది ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుందని కార్మికులు చెబుతున్నారు. దీనివల్ల 30 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని వారు వివరిస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. సెయిల్ లో విలీనం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కొరత తీరుతుందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. “ఉత్పత్తి వ్యయం టన్నుకు 6000 రూపాయల వరకు తగ్గుతుంది. గంగవరం, విశాఖపట్నం నౌకాశ్రయాల ద్వారా విశాఖ ఉక్కును ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంటుంది. 50 లక్షల టన్నులకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెసలు బాటు ఉంటుంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణను విరమించుకోవాలని” కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం కేంద్రంలో కూటమి ఎంపీలు కీలకంగా ఉన్నారు. కూటమిలో ఉన్న ఇద్దరు ఎంపీలకు పదవులు కూడా లభించాయి. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని వాదనలు వినిపిస్తున్నాయి.”విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు వారి వాణి వినిపించారు. ఎన్నికల సమయంలోనూ అదే విషయాన్ని పదేపదే చెప్పారు. అందువల్లే విశాఖపట్నం జిల్లా వాసులు కూటమికి జై కొట్టారు. ప్రజలు ఇచ్చిన ఆ తీర్పును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో చొరవ చూపాలి. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకించాలి. సెయిల్ లో విశాఖ ఉక్కు కర్మాగారం కనుక విలీనం అంటే.. కర్మాగారం మాత్రమే కాకుండా, విశాఖపట్నం రూపురేఖలు కూడా మారుతాయి. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని” విశాఖ ఉక్కు కర్మాగారం లో పనిచేసే కార్మికులు కోరుతున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో వేచి చూడాల్సి ఉంది.