AP Elections 2024: తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. బిఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ఇప్పుడు అందరి దృష్టి ఏపీ పై పడింది. విజేత ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈసారి ఫైట్ హోరా హోరీగా నడవనుంది. విజయం అంత సులువుగా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారు ధీమా కనబరుస్తున్నా లోలోపల మాత్రం గుబులు రేగుతోంది.
గత ఎన్నికల్లో వైసిపి అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. జగన్ సీఎం చేయాలని ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుడిలా పని చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ప్రభుత్వం వస్తుందని భావించి జగన్కు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్ ను మరోసారి సీఎం చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయా? ఉద్యోగ, ఉపాధ్యాయులు అనుకుంటున్నారా? అంటే మాత్రం సమాధానం లేదు. గతసారికలిసి వచ్చిన వర్గాల్లో.. ఒక్కటి కూడా వైసీపీతో లేదు. ఒక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం కొంత సానుకూలంగా ఉన్నారు. అయితే వాడు కూడా ఓటు వేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఏపీలో అర్బన్ ఓటర్లు మాత్రం జగన్ ను వద్దనుకుంటున్నారు. గ్రామీణ వాటర్ లు మాత్రం స్తబ్దతగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలపై విసుగు చెంది ఉన్నారు. దీంతో వీరంతా ప్రత్యామ్నాయం వైపు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు వరకు సమ్మతి లేకున్నా.. కొత్తగా పవన్ జతకట్టడంతో ఆ కూటమి వైపు చూస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సమాజంతో మాకేంటి? మాకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా? లేదా? అన్న పేద వర్గాలు మాత్రం మరోసారి జగన్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాయి.అయితే అదే స్థాయిలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల, చార్జీలు, పన్నుల పింపును తప్పు పడుతున్నాయి. వారిని నియంత్రించాల్సిన వైసీపీ సైన్యం మునుపటిలా పనిచేయడం లేదు. ఈ అసంతృప్తి పెరిగితే మాత్రం వైసిపికి కష్ట కాలమే.
రాజకీయంగా ఇప్పుడు వైసీపీకి సంధి కాలం. పార్టీ అభ్యర్థులను మార్చి మరోసారి విజయం అందుకోవాలని జగన్ భావిస్తున్నారు. అటు నాయకులు తమకు అన్యాయం జరిగితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని సంకేతాలు పంపుతున్నారు. ఇలా ఎలా చూసినా వైసీపీకి ఇబ్బందికరమే. అయితే టిడిపి, జనసేన పొత్తుతో ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఏర్పడింది. ప్రత్యామ్నాయం మేమే అన్న రీతిలో ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అయితే అది దిగువ స్థాయి నేతల్లో వర్కౌట్ అయితేనే ఫలితం ఉంటుంది. టికెట్ ఏ పార్టీకి వచ్చిన ఓట్ల బదలాయింపు జరిగితే దానికి సార్ధకం చేకూరుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలది జగన్కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండగా.. కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. సీట్ల సర్దుబాటు తో పాటు ప్రజలను ఆకర్షించే విధానాలతో ముందుకెళితే మాత్రం టిడిపి, జనసేన కూటమి విజయం వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవి వికటించే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లోనమ్మకస్తులుగా భావించిన నాయకులకు జగన్ టికెట్లు ఇచ్చారు. ఈసారి మొండి చేయి చూపుతున్నారు. వారంతా ఎదురు తిరగడంతోపాటు ప్రత్యర్థికి సాయం అందిస్తే మాత్రం జగన్ చిక్కుల్లో పడినట్టే. మరీ ముఖ్యంగా జనాలను ఆకర్షించే విషయంలో టిడిపి, జనసేనలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తే సత్ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో.. దానిని క్యాష్ చేసుకుంటే మాత్రం కూటమికి తిరుగులేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూటమి వైపు మొగ్గుచూపితే.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. వైసిపి ప్రభుత్వానికి బాహటంగావ్యతిరేకించేవారు ఈ కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.