https://oktelugu.com/

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విమానం ఎగిరేదెప్పుడు జగనన్న

ఐదు వందల ఎకరాలు తగ్గించినందుకు విమానాల సర్వీసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. 

Written By:
  • Dharma
  • , Updated On : May 1, 2023 11:56 am
    Follow us on

    Bhogapuram Airport : రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? అంటారు. ఏపీలో జగన్ పాలనలో దీనిని చేసి చూపించారు. పవర్ పాలిట్రిక్స్ చేసి ప్రత్యర్థులను షేక్ చేశారు. కేసులు, దాడులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కానీ ప్రజలను మాత్రం సంక్షేమ తారకమంత్రంతో కట్టిపడేశారు. సెంటిమెంట్ అస్త్రాలను సంధించి అంతులేని ప్రజాభిమానం పొంది అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో ఎన్నెన్నో మాటలు చెప్పారు. ‘ఎన్నికల సమయంలో శంకుస్థాపనలు చేస్తే అది మోసమే అవుతుంది. అదే తొలినాళ్లలో చేస్తే చిత్తశుద్ధి అవుతుంది’ అంటూ విపక్ష నేతగా జగన్ చెప్పుకొచ్చారు.  అయితే ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా ఒక్క ఏడాది ముందు శంకుస్థాపనలు చేసిన తాను అభివర్ణించిన ‘మోసాన్ని’ అభివృద్ధిగా చూపించిన గడసరి నేతగా మారిపోయారు.
    పైకిలేవని విమానం..
    ఉత్తరాంధ్ర విమానం కథనే తీసుకుందాం. అప్పుడెప్పుడో చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడదే ఎయిర్ పోర్టుకు మరోసారి శంకుస్థాపనకు జగన్ సిద్ధపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రారంభిస్తామని.. తొలి రెండున్నరేళ్లలో ఉత్తరాంధ్రపై విమానాలు చక్కెర్లు కొడతాయంటూ నమ్మబలికారు. చంద్రబాబు సర్కారు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేశారు. నాలుగేళ్లుగా అటువైపుగా చూడకపోగా.. ఇప్పుడు ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగంలోకి దిగారు. రానున్నది ఎన్నికల సీజన్.. ఎలా కడతారంటే తప్పకుండా కట్టితీరుతాం. ఉత్తరాంధ్ర  గ్రామాల మీదుగా విమానాలను నడిపేస్తామంటూ చెబుతున్నారు.
    కాంట్రాక్టులన్నీ రద్దు..
    రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విశాఖ ప్రధాన నగరమైంది. అధికారికంగా రాజధాని అన్న మాట లేకుండా ఆర్థిక రాజధానిగా చేయాలని నాటి చంద్రబాబు సర్కారు భావించింది. విమానాలు ఆగే జంక్షన్ గా భోగాపురం ఎయిర్ పోర్టును ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఇందుకుగాను చంద్రబాబు గట్టి ప్రణాళికలే వేశారు కాంట్రాక్టు జీఎంఆర్‌కు దక్కింది. శంకుస్థాపన కూడా చేశారు. ఇక పనులు కొనసాగించాల్సిన పరిస్థితులో వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్టులు రద్దు చేసింది. చివరికి జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్ చేతులు మారిన తర్వాత ఐదు వందల ఎకరాలు ఎయిర్ పోర్టుకు తగ్గించి మళ్లీ ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఐదు వందల ఎకరాలు తగ్గించినందుకు విమానాల సర్వీసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
    వారి త్యాగాలకు విలువ లేకుండా
    భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితులకు జగన్‌ ఇచ్చిన మాటా బుట్టదాఖలైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఆ ప్రాంతంలో పర్యటించినపుడు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హామీ ఇచ్చారు. అవసరమైతే టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూములను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక యథావిధిగా భూములు సేకరించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు. అటు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఇంకా అక్కడ ఇళ్ల నిర్మాణం జరగక ముందే ఉన్న గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించారు. మొత్తానికైతే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపన చేసి జగన్ ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపనున్నారో చూడాలి మరీ..