Vasireddy Padma : ఊడిపోయిన పదవిలో ఉండి ఈ నోటీసులెంటి పద్మక్క?

వాసిరెడ్డి పద్మ తాను పదవిలో ఉన్నట్టూ.. ఊహల పల్లకిలో విహరిస్తూ జీవోలు, మెమోలు తెగ జారీచేస్తున్నారు. మొన్న ఆ మధ్యన వలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏకంగా నోటీసులిచ్చారు. పది రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని పేర్కొన్నారు.

Written By: Dharma, Updated On : July 19, 2023 1:21 pm
Follow us on

Vasireddy Padma : ఆ మధ్యన వచ్చిన వినోదం అనే సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తుంది. లేని బ్యాంకును ఉన్నట్టు పిసినారి కోటా శ్రీనివాసరావును బురిడీ కొట్టించే సీన్స్ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తెలుగు నాట ఆ సినిమాయే గుర్తుకొస్తుంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో వాసిరెడ్డి పద్మ అలా వ్యవహరించి రక్తికట్టిస్తున్నారు. ఎప్పుడో రెండు నెలల కిందట ముగిసిన పదవిలో కొనసాగుతూ ఆమె చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నోటీసులు, జీవోలు పేరిట అలజడి రేపుతున్నారు . అయితే ఆమె తెలిసి చేస్తున్నారో.. తెలియకుండా చేస్తున్నారో.. కానీ ప్రజల ముందు నవ్వులపాలయ్యారు.

విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ వాసిరెడ్డి పద్మ గట్టిగానే వాయిస్ వినిపించారు. అప్పట్లో నెల జీతానికి పార్టీలో పనిచేశారని సొంత పార్టీ వారే చెవులు కొరుక్కునేవారు. అయితే అందరి మాదిరిగానే చట్టసభల్లోకి వెళ్లాలని అభిలాషించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె సేవలకు గుర్తుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. ఏకంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని నిర్ధారిస్తూ బహిరంగ జీవో జారీచేశారు. అయితే ఆ పదవి రెండేళ్లకు కుదిస్తూ జారీచేసిన జీవో విషయంలో మాత్రం గోప్యత పాటించారు. అయితే ఈ విషయం తెలియని పద్మ మాత్రం పదవిలో ఉన్నట్టు జీవోలు, ఆదేశాలు జారీచేయడం మాత్రం కొంచెం అతిగా అనిపిస్తోంది.

2019 ఆగస్టులో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. లెక్కప్రకారం 2024 వరకు ఆమె ఈ పదవిలోనే ఉండాలి. కానీ… జగన్‌ సర్కారు ఈ చట్టాన్ని సవరించింది. మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి పదవీకాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 24 తేదీన గెజిట్‌ను ప్రచురించింది. మే 9న జీవో విడుదలైంది. అదే నెల 15తో కొత్త చట్టం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అంటే ఆ రోజుతో ఆమె పదవీకాలం ముగిసినట్టేనన్న మాట. అయితే ఆమెను పునర్నియమిస్తూ జీవో జారీచేశారంటే అదీ లేదు.

వాసిరెడ్డి పద్మ తాను పదవిలో ఉన్నట్టూ.. ఊహల పల్లకిలో విహరిస్తూ జీవోలు, మెమోలు తెగ జారీచేస్తున్నారు. మొన్న ఆ మధ్యన వలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏకంగా నోటీసులిచ్చారు. పది రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పనిచేయకపోవడం వల్లే వలంటీరు వ్యవస్థను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం తరుపున వకల్తా తీసుకొని మరీ మాట్లాడారు. ఇప్పుడు తెలిసో.. తెలియక తప్పుచేసి అడ్డంగా బుక్కయ్యారు. పూర్తిగా మౌనాన్ని పాటిస్తున్నారు.