YSRCP situation in AP: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ బలం పుంజుకుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2029 ఎన్నికల్లో మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా అలా వ్యవహరించడంలో ఎంత మాత్రం తప్పులేదు. ఎందుకంటే ఓడిపోయిన ప్రతి పార్టీ గుణపాఠాలు నేర్చుకొని పైకి లేవాలి. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపాలి. ఇప్పుడు అదే పని చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అంతవరకు ఓకే కాని.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆ పార్టీ పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల అదే పరిస్థితి ఉంది. రాయలసీమలో ఎంతో కొంత పర్వాలేదనిపిస్తోంది కానీ అది ఆశించినంత కాదు. కానీ కోస్తాలో లేదు.. ఉభయగోదావరిలో లేదు.. ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఆ పార్టీ శ్రేణులు సైతం పూర్తిగా బయటకు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకే ఒక్క కారణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికీ భయంతోనే ఉన్నాయి. కూటమిలో బిజెపి ఉన్నంతకాలం.. కేంద్ర పెద్దలు టిడిపి కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచినంత కాలం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగేందుకు ఛాన్స్ ఇవ్వరు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు వైసీపీ శ్రేణులు. ఎప్పుడైతే చంద్రబాబు కేంద్ర పేదలకు దూరమయ్యారు నాడే ఆంధ్రప్రదేశ్ వైసీపీకి చిక్కింది. మళ్లీ చంద్రబాబు దానిని సెట్ చేసుకున్నారు. బిజెపితో జత కలిశారు. అధికారానికి దూరమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ సెంటిమెంట్ ను ప్రధానంగా నమ్ముతున్నారు వైసీపీ శ్రేణులు. మరోవైపు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతుంది.
బలమైన ప్రాంతంలో సైతం..
రాష్ట్రంలో రాయలసీమ( Rayalaseema ) అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం. అటువంటి ప్రాంతంలోనే గడిచిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 52 స్థానాలకు గాను ఏడు సీట్లకు పరిమితం అయింది ఆ పార్టీ. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు గాను.. అనంతపురంలో అసలు ఖాతా తెరవలేదు. కడపలో మూడు సీట్లు, చిత్తూరులో రెండు సీట్లు, కర్నూలులో రెండు సీట్లు గెలిచింది. మిగతా 47 సీట్లలో టిడిపి కూటమి పాగా వేసింది. అయితే కడపలో చిన్నపాటి అలజడి వచ్చింది కానీ.. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అని చెప్పలేము. కూటమికి కేవలం జాగ్రత్తగా ఉండమన్న సంకేతాలు తప్పించి.. భారీ వ్యతిరేకత అయితే మాత్రం కనిపించడం లేదు.
అత్యంత బలహీనం..
కోస్తాంధ్ర ( coastal Andhra ) విషయానికి వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో కూడా ముందుకు సాగడం లేదు. ఇక్కడ కూటమి స్ట్రాంగ్ గా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. పైగా ఇక్కడ టిడిపికి అనుకూల పవనాలు ఎప్పుడు ఉంటాయి. ఈ 18 నెలల కాలంలో కోస్తాంధ్రలోని నాలుగు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోలేకపోయింది. కొన్నిచోట్ల అయితే అసలు నాయకత్వమే లేదు. నెల్లూరు జిల్లాలో అయితే రోజురోజుకు ఆ పార్టీ బలహీనం అవుతోంది. ప్రకాశం జిల్లాలో సర్వశక్తులు ఒడ్డుతోంది కానీ పుంజుకోలేకపోతోంది. గుంటూరు తో పాటు కృష్ణాజిల్లా గురించి చెప్పనవసరం లేదు.
ఉభయగోదావరిలో. ఉభయగోదావరి( combined Godavari) జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంది. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు కూడా లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కొట్టిన దెబ్బకు చాలామంది నేతలకు జ్ఞానోదయం అయింది. అందుకే వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ తగ్గించారు. ప్రస్తుతం చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలు యాక్టివ్ గా లేరు. పిఠాపురం లాంటి చోట వంగా గీతా లాంటి నేతలు ఇన్చార్జిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత ఆమె కనిపించకుండా మానేశారు. ఆమె ఒక్కరే కాదు గోదావరి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో పరిస్థితి అదే.
ఒక్క విజయనగరం
ఉత్తరాంధ్రలో ( North Andhra ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత పర్వాలేదనిపిస్తున్న జిల్లా విజయనగరం. ఎందుకంటే అక్కడ బొత్స ఫ్యామిలీ ఉంది. రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. అందుకే అక్కడ కూటమి దూకుడుకు తట్టుకోగలుగుతోంది. విశాఖ జిల్లా అంటే ఎప్పుడూ ఆశలు వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ జిల్లా బాధ్యతలను బొత్సకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలో నేతలు ఆక్టివ్ అయ్యారు కానీ.. ప్రజల్లో మాత్రం వెళ్లలేకపోతున్నారు. సీనియర్ల మధ్య సమన్వయ లోపం ఉంది. ధర్మాన బ్రదర్స్ యాక్టివ్ కావడం ఆ పార్టీకి ఉపశమనం. కానీ తమ్మినేని సీతారాం లాంటివారు శ్రద్ధగా తిరగడం లేదు. ఆపై చాలా రకాల సమస్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోలేదని చెప్పవచ్చు. ఇలా నాలుగు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.