CM YS Jagan : వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న అంతులేని ధీమా వైసీపీలో కనిపిస్తోంది. వైనాట్ 175 అన్న నినాదం మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పక్కనపడేశారు. ఇప్పుడు విజయం సాధిస్తామని మాత్రమే చెబుతున్నారు. కొందరైతే శపధం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా ఫలితం మాదేనని కుండబద్దలు కొడుతున్నారు. అయితే అది చేసి చూపేందుకు చాన్స్ ఉన్నా జగన్ సర్కారు సాహసించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు చాలావరకూ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని కార్పొరేషన్లు, మునిసిపాల్టీలకు ఎన్నికలు జరిపించాల్సి ఉంది. కానీ జగన్ సర్కారు ఎందుకో వెనక్కి తగ్గుతోంది. ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగిస్తోంది.
కానీ ఉన్నట్టుండి స్థానిక సంస్థలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వెలువడింది. అవి ఎన్నికల గురించే. కానీ ప్రత్యక్ష ఎన్నికలు కాదు. మునిసిపాల్టీ రెండో చైర్ పర్సన్…. కోఆప్షన్ మెంబర్ల ఎన్నికల కోసం ఈ షెడ్యూల్ విడుదల చేశారు. కానీ పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, మునిసిపాల్టీలు, జడ్పీడీసీలు, వార్డు మెంబర్లు సంగతేంటి అన్నది మాత్రం చెప్పడం లేదు. వాస్తవానికి స్థానిక సంస్థల్లో పెండింగ్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించి సంపూర్ణ గెలుపు దక్కించుకోవాలన్నది ప్లాన్. తద్వారా విపక్షాల ఆత్మస్థైర్యం మీద దెబ్బకొట్టాలని భావించారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతికూల ఫలితాలు ఆ నిర్ణయాన్ని మార్చేశాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను ఏ రేంజ్ లో నిర్వహించారో అందరికీ తెలిసిందే. భయపెట్టి మరీ ప్రజలను ఓటింగ్ కు తీసుకెళ్లగలిగారు. తమకు అనుకూలంగా ఓటింగ్ చేయించుకున్నారు. స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా తమ వారిని కూర్చోబెట్టుకున్నారు. అధికారం చేతిలో ఉండి ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా స్పష్టత ఉన్న ప్రభత్వానికి ఇప్పుడు ఎందుకో భయం వెంటాడుతోంది. రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సెమీ ఫైనల్ గా భావించి ఎన్నికలకు దిగాల్సిన ఉన్నా జగన్ సర్కారు ఆ సాహసానికి పూనుకోవడం లేదు. దీనిపై విపక్షాలు ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రజా వ్యతిరేకతకు భయపడే ఎన్నికలు నిర్వహించడం లేదని చెబుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More