https://oktelugu.com/

APPSC : ఏపీపీఎస్సీది ప్రభుత్వ ధిక్కారమేనా?.. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఏం జరగనుంది?

APPSC : ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమే. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆదేశాలను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడం ఏమిటి? నిజంగా ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించిందా? ఎన్నికల కోడ్ లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ నడుమ ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విధానాన్ని సరి చేయాల్సి ఉన్నందున.. కొద్దిరోజులపాటు పరీక్ష వాయిదా […]

Written By: , Updated On : February 23, 2025 / 01:29 PM IST
APPSC

APPSC

Follow us on

APPSC : ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమే. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆదేశాలను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడం ఏమిటి? నిజంగా ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించిందా? ఎన్నికల కోడ్ లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ నడుమ ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విధానాన్ని సరి చేయాల్సి ఉన్నందున.. కొద్దిరోజులపాటు పరీక్ష వాయిదా వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీ బోర్డుకు లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పట్టభద్రులకు ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ కార్యదర్శి తేల్చి చెప్పారు. దీంతో పరీక్షలు వాయిదా పడకుండా యధావిధిగా జరుగుతున్నాయి.

* సీఎం లేఖ కు స్పందన లేకపోవడం ఏంటి
అయితే సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఏపీపీఎస్సీ స్పందించకపోవడం ఏమిటని.. తమ నిర్ణయం మార్చుకోకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకటి ప్రభుత్వ ఆదేశాలను లోపయికారిగా అమలు చేసే ఉద్దేశమైనా ఉండాలి.. లేకుంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఏపీపీఎస్సీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునైన ఉండాలి. అయితే దీనిని ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నేరుగా వైసీపీ నేతలు విమర్శించడంతోపాటు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* నిన్న రోజంతా ఆందోళనలు
నిన్న రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనను కొనసాగించారు. ఒకానొక దశలో అభ్యర్థులపై పోలీసులు ప్రతాపం చూపారు. ఇంకో వైపు చూస్తే నాలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నిరుద్యోగుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు స్పందించారు. నేరుగా లేఖ రాశారు. కానీ ఏపీపీఎస్సీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించలేదు. సీఎం కోరిన విధంగా పరీక్ష వాయిదా వేయలేదు.

* టిడిపిలో అదే అనుమానం
ఒకవేళ సీఎం చంద్రబాబు కోరిన విధంగా నిర్ణయం తీసుకోకుంటే మాత్రం.. ఎన్నికల కోడ్ తర్వాత ఏపీపీఎస్సీ బోర్డుపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. ఇప్పటికీ ఏపీపీఎస్సీ బోర్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉన్నారన్నది ప్రధాన అనుమానం. అందుకే తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏపీపీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.