YS Jaganmohan Reddy : జగన్ భయపడుతున్నారా? మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారా? కేసుల భయం వెంటాడుతోందా? చంద్రబాబు తనను అంత ఈజీగా వదలరని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మొన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. నేడు పుంగనూరు పర్యటన రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్య సంచలనం గా మారింది. ఈ కేసు మిస్టరీ వీడలేదు. బాలిక అదృశ్యమైన మూడు రోజుల తర్వాత శవమై తేలింది. కానీ హత్య ఎవరు చేశారు అన్నది పోలీసులు తేల్చలేకపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరకు ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణం అని తేల్చారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. నేర నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపణలు చేశారు. బాధిత కుటుంబాన్ని అక్టోబర్ 9న పరామర్శిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అయితే ఉన్నపలంగా తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు జగన్. నిందితులు దొరికిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందునే జగన్ పుంగనూరు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారని.. జగన్ వస్తున్నాడు అని తెలిసి ప్రభుత్వం అలర్ట్ అయిందని.. నిందితులను పట్టుకుందని ఆయన చెబుతున్నారు.అయితే బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె చనిపోయింది. ఆ కుటుంబాన్ని ప్రతిపక్ష నేతగా పరామర్శిస్తే వారికి ధైర్యం వచ్చినట్టు అవుతుంది. కానీ నిందితులు దొరికారన్న కారణం చూపుతూ జగన్ పర్యటనను రద్దు చేసుకోవడం పై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* మొన్న తిరుమల పర్యటన రద్దు
మొన్నటికి మొన్న తిరుమల పర్యటనను సైతం జగన్ రద్దు చేసుకున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపీ పై ఆరోపణలు వచ్చిన క్రమంలో.. అదంతా చంద్రబాబు ఆడిన డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. అయితే డిక్లరేషన్ అంశం తెరపైకి రావడంతో.. లేనిపోని ఇబ్బందులు వస్తాయని తెలిసి వెనక్కి తగ్గారు. చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్నారు.
* ఇప్పుడు పుంగనూరు పర్యటన
అయితే తాజాగా పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో.. జగన్ తీరుపై చర్చ నడుస్తోంది. కేవలం ఇబ్బందులు వస్తాయని తెలిసి మాత్రమే జగన్ వెనక్కి తగ్గుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. ఆ కేసులకు భయపడి చాలామంది పార్టీని వీడుతున్నారు. తాను రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తే.. కూటమి ప్రభుత్వం సైతం అదే దూకుడు కనబరుస్తుంది. అది అసలు ఎసరు వస్తుందని.. పార్టీ శ్రేణులను మరింత నిరాశకు గురి చేస్తుందని భావించి జగన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే గతం మాదిరిగా జగన్ లో దూకుడు తనం కనిపించడం లేదు. దీంతో లేనిపోని సమస్యలకు దూరంగా ఉండటమే మేలని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.