Pawan Kalyan: పవన్ ఇక సినిమాలు చేయరా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సినిమాలకు గుడ్ బై చెబుతారా? ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారా? అదే జరిగితే సినిమాలను వదులుకోవాల్సిందేనా? ఇప్పుడు ఆసక్తి చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి.ఈ క్రమంలో పవన్ పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.కూటమిలో 144 స్థానాలతో పోటీ చేస్తున్నందున టిడిపి పెద్దన్న పాత్ర పోషిస్తోంది .కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తప్పకుండా సీఎం అవుతారు. అటువంటప్పుడు పవన్ ఏ పదవి చేపడుతారు అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.
రాజకీయాలతో పాటు సినిమాల్లో పవన్ కొనసాగుతున్నారు. ఒకటి వృత్తి అయితే.. మరొకటి ప్రవృత్తి అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్లో తనకు అప్పులు ఉన్నాయని చూపారు. అవి కూడా నిర్మాతల నుంచి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని అప్పులుగా చూపినట్లు తెలుస్తోంది. అంటే వారందరికీ సినిమాలు చేయాల్సి ఉందన్నమాట. ఇంకా చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతుంది. ఒకవేళ పవన్ డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి పదవి తీసుకుంటే.. తప్పకుండా సమయం కేటాయించాలి. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరోవైపుపాలన అంటే కుదిరే పని కాదు.
ఒకవేళ మంత్రి పదవి తీసుకుని పవన్ సినిమాలపై దృష్టి పెడితే విపక్షాలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు మంత్రి పదవి పవన్ తీసుకోరని.. పార్టీ ఎమ్మెల్యేలకు దక్కేలా చూస్తారని.. కేవలం ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషించేందుకే పవన్ ప్రయత్నిస్తారని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనసేన నుంచి కనీసం ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నాదేండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు లైన్లో ఉన్నారు. వారికి మంత్రి పదవులు ఇప్పించి.. ప్రభుత్వ నిర్ణయాల్లో పవన్ భాగస్వామ్యం అవుతారని.. సినిమాలన్నీ పూర్తయిన తర్వాత.. మంత్రివర్గ విస్తరణలో పవన్ పాలు పంచుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. ముందే పవన్ పాత్రను ఊహించుకోవడం అతి అవుతుందని రాజకీయ ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ పాత్ర పై భాగస్వామ్య పార్టీల్లో గట్టి చర్చ నడుస్తోంది.