Ambati Rayudu: అంబటి రాయుడు వైసీపీలో ఎందుకు చేరినట్లు? చేరిన 10 రోజులకే ఎందుకు వీడినట్టు? ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు? అసలేం జరిగింది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఇవే. అయితే వాటన్నింటినీ తెర దించుతూ అంబటి రాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకు వైసీపీలో చేరింది? ఎందుకు ఆ పార్టీని వీడింది? ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్న విషయం పూర్తి స్పష్టత ఇచ్చారు.
క్రికెట్ కెరీర్ లో అంతగా రాణించలేకపోయారు అంబటి రాయుడు. కానీ పొట్టి మ్యాచులలో రాయుడు సత్తా చాటారు. అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు. అయితే క్రికెట్ కెరీర్ లో కొనసాగుతుండగా రాజకీయాలపై మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వైసీపీ విధానాలతో పాటు జగన్ పాలనను మెచ్చుకోవడం ద్వారా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఏడాది కిందట నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి నడిచారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కీలక నేతలతో సమావేశం అయ్యారు. వన్ ఫైన్ మార్నింగ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఇలా చేరిన పది రోజులకే ఆ పార్టీని వీడారు.
అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అటు వైసిపి హై కమాండ్ సైతం ఆయనకే టికెట్ అని లీకులు ఇచ్చింది. అటు తరువాత అంబటి రాయుడు ను కాదని. లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతరుల పేర్లు పరిశీలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అంబటి రాయుడు వైసీపీని వీడినట్లు ప్రచారం జరిగింది. అయితే తాను క్రికెట్ కెరీర్ గురించే.. వైసీపీ నుంచి బయటకు వచ్చానని.. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కానీ అక్కడకు రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ తో ప్రయాణం చేయాలని తన మనసులో ఉన్న మాటను చెప్పారు. అటు తరువాత ఆయన బయట కనిపించడం మానేశారు.
కొద్ది రోజుల కిందట మేమంతా సిద్ధం పేరిట జగన్ రాష్ట్ర యాత్ర బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పులివెందులలో ఈ యాత్ర ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ అయింది. మేము కూడా సిద్ధం అంటూ రాయుడు చేసిన ఈ ట్విట్ తో.. ఆయన మళ్లీ వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. అక్కడికి కొద్ది రోజులకే జనసేన తన స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రకటించింది. అందులో అంబటి రాయుడుకు చోటు దక్కింది. ప్రస్తుతం జనసేనకు మద్దతుగా అంబటి రాయుడు ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో పర్యటించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.’ గతంలో నేను వైసీపీ వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడ వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించింది. వెంటనే బయటకు వచ్చేసా. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు వచ్చి జనసేనలోకి వచ్చా. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం ఓటమి అభ్యర్థులను మనమంతా గెలిపించు కోవాల్సిన అవసరం ఉంది’ అంబటి రాయుడు పేర్కొన్నారు. యువత పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలపాలని కోరారు. మొత్తానికైతే వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో అంబటి రాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.