Jagan: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా? ముహూర్తం ఫిక్స్ చేశారా? అయితే ఉప ఎన్నికలకు వెళ్లి సత్తా చాటుకోవాలనుకుంటున్నారా? లేకుంటే అనర్హత వేటు పడుతుందనా? అసలు జగన్( Y S Jagan Mohan Reddy ) మదిలో ఏముంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లి.. గెలిచిన రికార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అంతా ఉప ఎన్నికల కోసమే జగన్ ఈ ప్లాన్ వేసారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం అనర్హత వేటు భయంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
ఆ సాహసం చేస్తారా?
ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే జరిగేది జగన్ కు తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేయించారు. మరోవైపు ప్రభుత్వం అనర్హత వేటు అని భయపెడుతోంది. ఆ భయంతోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో అలా చెప్పి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కారు. ఇకనుంచి రానని కూడా తేల్చి చెప్పారు. అటువంటి చర్చకు చెక్ చెప్పాలని భావించారు. అయితే ప్రభుత్వం అనర్హత వేటుకు సిద్ధమయ్యిందన్న సమాచారం ఆయన వద్ద ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. సభకు హాజరైతే అనర్హత వేటు పడుతుందని భయపడి వచ్చారని విమర్శలు రావడం ఖాయం. అందుకే గత్యంతరం లేని స్థితిలో రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకు ఈనెల 24 ముహూర్తం గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
* ప్రస్తుతం బెంగళూరులో..
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) ప్రారంభమైన రోజు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. సభకు హాజరవుతారు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అధినేత తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మారు. కానీ వారి ఆశలను అడియాసలు చేశారు. సభకు హాజరు కావడం లేదని తేల్చేశారు. నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్లీ 24న తాడేపల్లి కి రానున్నారు. ఆరోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అత్యవసర సమావేశానికి అంత హాజరుకావాలని ఎంపీలతో పాటు సీనియర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏదో జరగబోతోంది అన్న అనుమానాలు ఉన్నాయి.
* రెండే ఆప్షన్లు..
జగన్మోహన్ రెడ్డి ఎదుట ఇప్పుడు రెండే ఆప్షన్లు( Two options) ఉన్నాయి. ఒకటి అసెంబ్లీకి వెళ్లడం.. రెండోది రాజీనామాలు చేయడం. అసెంబ్లీకి వెళ్లడం అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తలవంచడమే అవుతుంది. చంద్రబాబు మాదిరిగా మళ్లీ హౌస్ లో సీఎంగానే అడుగు పెడతానని భారీ శపథం కూడా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల కోసం ఉన్నపలంగా అసెంబ్లీకి వస్తే చాలా చిన్న చూపు చూస్తారు. యూటర్న్ నిర్ణయాలని ఎద్దేవా చేస్తారు. అందుకే సభకు హాజరు కావడం కంటే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలకు ఒప్పించే అవకాశం ఉంది. పదవికి రాజీనామా చేసి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారని అంచనా వేస్తున్నారు. అయితే విశ్లేషకుల అంచనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అందరూ. ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఎప్పుడూ విచిత్రమే..!