Balakrishna- Jr NTR: ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు రచ్చ రంబోలా చేస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ శ్రేణులు… నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రగిల్చింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. యూనివర్సిటీ పేరు మార్పుపై అన్ని పార్టీల నాయకులు స్పందించారు. ప్రభుత్వ తీరుపై అందరూ మండిపడ్డారు. చివరకు వైఎస్ కుమార్తె షర్మిళ కూడా మండిపడ్డారు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే అందరి దృష్టి నందమూరి కుటుంబసభ్యులపైనే పడింది. ముందుగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. అటు తరువాత పురందేశ్వరి కూడా స్పందించారు.ఎన్టీఆర్ మనువలు కల్యాణ్ రామ్ తో పాటు మరికొందరు కూడా స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. ఆయన్నుంచి ఘాటైన వ్యాఖ్యలు వస్తాయని భావించారు టీడీపీ వర్గాలు. ఓ రేంజ్ లో విరుచుకుపడతారని ఆశించారు. కానీ కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు కామెంట్స్ చేశారు.రెండే రెండు లైన్లతో సరిపుచ్చారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు లెజెండ్రీలేనని పోల్చారు. పేర్లు మార్చినంతమాత్రాన వారి స్థాయి తగ్గదు అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరుపై ఇప్పుడు టీడీపీ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తాత ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవంగా చెప్పుకొచ్చే జూనియర్ స్పందించిన తీరుపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫేవర్ కనిపిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. పిల్లకిచ్చిన మామతో పాటు తన సన్నిహితులుగా చెప్పుకొంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉండడంతోనే వెనక్కి తగ్గారన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జూనియర్ కు కావాల్సిన వారు వైసీపీలో టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారికి రాజకీయంగా మేలు జరగాలంటే ప్రస్తుతానికి తాను తగ్గి ఉండాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ నాయకుడంటూ నమ్మిన వారు సైతం జూనియర్ వ్యవహార శైలి మింగుడుపడడం లేదు. ఎన్టీఆర్ ను వైఎస్సార్ తో పోల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు మాత్రం జూనియర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా జూనియర్ వ్యవహరించారని సోషల్ మీడియాలో సపోర్టు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ, జూనియర్ అభిమానుల మధ్య రగడగా మారింది.
ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి అభిమానులకు పుల్ జోష్ ఇస్తూ బాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వం పై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మార్చేయ్యడానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఒక సంస్కృతి..ఓ నాగరికత..తెలుగుజాతి వెన్నుముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి హెల్త్ యూనివర్సిటీ మార్చాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి…తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ ఓ రెంజ్ లోఫైర్ అయ్యారు. ఇవి నందమూరి అభిమానులకు టానిక్ లా పనిచేస్తున్నాయి. బాలయ్య వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో జూనియర్ చర్యలను ఖండిస్తున్నారు. ఒకరు ఫైర్.. ఒకరు నీరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ అంశంపై జూనియర్ స్పందించకుండా ఉండాల్సిందని నందమూరి హార్ట్ కోర్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

అటు జూనియర్ ఎన్టీఆర్ స్పందన… పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న నాయకుల కామెంట్లు చూసి బాలకృష్ణ తనదైన రీతలో స్పందించారు. ‘ఆ మహనీయుడు ఎన్టీఆర్ భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు..పీతలున్నారు.. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయి…శునకాల ముందు తలదించుకునే సిగ్గులేని బతుకులు’ అంటూ బాలకృష్ణ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు. అయితే వరుస ట్విట్లతో బాబాయ్ ఫైర్ అవుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రెండే రెండు మాటలతో శాంతి వచనాలు బోధించడంపై మాత్రం దుమారం నడుస్తోంది. జూనియర్ స్పందనతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అందుకే వారి స్థైర్యం నింపేందుకు బాలయ్య రంగంలోకి దిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రగిల్చిందని అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ కు కావాల్సిందదేనని భావిస్తున్నారు.