Jagan- ABN RK: ఏపీలో కులాల కుంపట్లు ఇప్పటివి కావు.దశాబ్ధాల కిందటే అవి బీజం నాటుకున్నాయి. కానీ గత ఎన్నికల్లో మాత్రం కులాల మధ్య కుంపట్లు రగిల్చి మరీ జగన్ అధికారంలోకి రాగలిగారు. 13 జిల్లాల్లో కులాలను, మతాలను నిలువునా చీల్చి అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. రాజకీయాలపై అవగాహన ఉన్నవారు ఇట్టే చెప్పేస్తారు. కానీ ఈ విషయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు తెలియకపోవడం విడ్డూరమే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో జగన్ కుల రాజకీయాలకు తెరతీశారని…ఎన్టీఆర్ ను అడ్డం పెట్టుకొని ఆయన సామాజికవర్గంపై ఇతర వర్గాల్లో ధ్వేషం నింపేలా చూస్తున్నారంటూ ఆర్కే వారం..వారం రాసే తన కొత్తపలుకులో రాసుకొచ్చారు. ఈ వారం జగన్ కుల రాజకీయాల గురించే కేటాయించారు. కానీ ఈ కథనంలో కొత్త విషయాలేవీ లేవు. అయితే జగన్ కొత్తగా కుల రాజకీయాలు మొదలు పెట్టలేదు. గత ఎన్నికలకు ముందే పీకే టీమ్ తో పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. కులాల మధ్య,వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందారు.

టీడీపీ సలహాదారుల్లో ఆర్కే ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన టీడీపీతో పాటు చంద్రబాబు శ్రేయోభిలాషి. తెలుగునాట విశిష్ట నెట్ వర్క్ ఉన్న మీడియా అధిపతి. జగన్ ను తక్కువగా అంచనా వేసి.. కుల రాజకీయాలు అంతగా పనిచేయవు అని తన ‘ఆంధ్రజ్యోతి’లో రాసుకొచ్చారు. కేవలం చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసి ఓటు వేస్తారని తమ సర్వేల ద్వారా నమ్మించారు. కానీ జగన్ ఏపీలో చాపకింద నీరులా కుల రాజకీయాలు మొదలు పెట్టారన్న విషయాన్ని గ్రహించలేదు. తెలిసినా సీరియస్ గా పట్టించుకోలేదు. అదే దారుణ పరాజయానికి కారణమైంది. అయితే ఎన్టీఆర్ పేరు మార్చే వరకూ జగన్ కుల రాజకీయాలు చేయనట్టు ఆర్కే చెప్పుకొచ్చారు. అయితే దీనిపై టీడీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని చెప్పినా చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్కే చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ చేస్తున్నవే కుల రాజకీయాలు. కానీ ఆయన్ను లైట్ తీసుకున్నారు. వేరే ప్రణాళిక, వ్యూహంతో చంద్రబాబు వెళ్లారు. ఇందులో రాధాకృష్ణ కూడా భాగస్థులే. నాడు జగన్ కుల రాజకీయాలపై టీడీపీ సైలెంట్ గా ఉంది. వేరే మార్గంలో ప్రజలను ఆకట్టుకునేందుకే మొగ్గుచూపింది. కనీస స్థాయిలో కూడా కౌంటర్ ఇవ్వలేదు. నాడు విషయం చెప్పాల్సింది పోయి ఆర్కే ఇప్పుడు కుల రాజకీయాల గురించి మాట్లాడడమేమిటని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారు. అసలు ఆర్కే టీడీపీకి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా అన్న అనుమానం వారిని వెంటాడుతోంది. టీడీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్కేతో టీడీపీకి మేలు లేదని చెబుతున్నారు. పార్టీ గెలిచినప్పుడు మాత్రం డ్యామేజ్ విషయాలు అధినేతకు చెప్పరని.. పార్టీ ఓటమి తరువాత నాడు అలా చేసుంటే బాగున్ను అని గుర్తుచేస్తారని.. ఇదెక్కడి అనాలసిస్ అని వాపోతున్నారు.

ఈ వారం తన కొత్త పలుకులో ఆర్కే ఒక లాజిక్ మిస్సయ్యారు. ఎన్టీఆర్ సామాజికవర్గంపై ధ్వేషం నింపాలంటే నేరుగా ఎన్టీఆర్ నే తిట్టేవారు. ఆయనపై గౌరవం ఉంది అని జగన్ సంభోదించారంటే దాని వెనుక భయం ఉంది. ఎన్టీఆర్ ను ఒక్క కమ్మ సామాజికవర్గం వారే అభిమానించరు. వెనుకబడిన, నిమ్మవర్గాలు సైతం ఎన్టీఆర్ ను ఆరాధిస్తాయి. వారు దూరమవుతారన్న భయం, ఆందోళనతోనే జగన్ జాగ్రత్తపడ్డారు. ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చారు. అటువంటప్పుడు ఎన్టీఆర్ ను కులం కోణంలో ఎందుకు చూస్తారని ఆర్కే ఆలోచించలేకపోయారు. జగన్ సహజంగా మొండివాడు. ప్రభుత్వ వైఫల్యం బయటపడినప్పుడు అదే స్థాయి చూపగల మరో అంశాన్ని తెరపైకి తెస్తాడు. ఎన్టీఆర్ పేరు మార్పు ఆ కోణంలో ఉండొచ్చు కదా. అయితే ఆర్కే చెబుతున్న కుల రాజకీయాలకు చిరునామా జగనే. ఇందులో సందేహం లేదు. కానీ దానికి విరుగుడు చర్యలు చెప్పాల్సింది పోయి.. పాత చింతకాయ వలే పదేపదే అదే మాట చెబుతుండడం మాత్రం రుచించడం లేదు.