https://oktelugu.com/

 YSR Close friends :  వైఎస్సార్ సన్నిహితులు ఏమయ్యారు?

మనం అభిమానించే వారు కష్టాల్లో ఉంటే తట్టుకోలేము. ఆ కుటుంబాల్లో వివాదాలు తలెత్తితే పరిష్కార మార్గం చూపడానికి ప్రయత్నిస్తాం. కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో రేగిన అలజడిని తగ్గించే ప్రయత్నం సన్నిహితులు ఎవరూ చేయకపోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : October 26, 2024 / 12:05 PM IST

    YSR Close friends

    Follow us on

    YSR Close friends :  తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబ సన్నిహితులు ఉన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించిన వారు ఉన్నారు. దాదాపు వారంతా ఆ కుటుంబ అభిమానులే. ప్రస్తుతం ఆ కుటుంబంలోరేగిన ఆస్తి వివాదం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కానీ దానిని సరి చేసే ప్రయత్నం ఒక్కరు కూడా చేయకపోవడం విశేషం. అటు జగన్ తో పాటు షర్మిల తో అనుబంధం ఉన్నవారు ఉన్నారు. ఆ కుటుంబానికి విధేయులుగా వ్యవహరిస్తున్న వారు ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కలుగజేసుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా భావించే కెవిపి రామచంద్ర రావు, ఉండవెల్లి అరుణ్ కుమార్, వై వి సుబ్బారెడ్డి,.. ఇలా ఎంతోమంది నేతలు ఉన్నారు.తెలంగాణలో అయితే చెప్పనవసరం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఇలా చాలామంది నేతలు ఉన్నారు. అటు జగన్ తో పాటు ఇటు షర్మిల తో సైతం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.కానీ ఆ కుటుంబంలో వచ్చిన ఆస్తి తగాదాలను మాత్రం పరిష్కరించలేకపోతున్నారు. ఇది ముమ్మాటికీ లోటే. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మరింత ముదిరిపోనున్నాయి.కానీ వైయస్సార్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారు పట్టించుకోకపోవడం విశేషం.

    * ఆత్మ కేవీపీ ఉన్నా
    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు.అదే పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కొనసాగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయన షర్మిలకు చెబితే వింటారు. అయితే జగన్కు చెబితే వింటారా? అదే జరిగి ఉంటే కెవిపి వైసిపి లో ఉండేవారు కదా?అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ తో మంచి సంబంధాలు లేనందువల్లే.. కెవిపి కలుగజేసుకోవడం లేదన్నది ఒక వాదన.

    * శ్రద్ధ చూపని ఉండవెల్లి
    వైయస్సార్ కు అత్యంత సన్నిహిత నేత ఉండవల్లి అరుణ్ కుమార్. రెండుసార్లు రాజమండ్రి నుంచి ఎంపీ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఎంపీ అయినట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు ఉండవెల్లి. ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలను తగ్గించి విశ్లేషణలు చెబుతున్నారు ఆయన. సుదీర్ఘ కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై న్యాయపోరాటం చేస్తున్నారు.ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కుటుంబంలో తలెత్తిన ఆస్తి విభేదాలు ఇట్టే పరిష్కరించే చతురత ఆయన వద్ద ఉంది. కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుకు రావడం లేదు.

    * బాబాయ్ పాత్ర పోషించని వైవి
    వై వి సుబ్బారెడ్డి.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి స్వయానా తోడల్లుడు. వైయస్సార్ మరదలు వైవి సుబ్బారెడ్డి భార్య. జగన్ తో పాటు షర్మిలకు బాబాయి గా ఉన్న వైవి.. ఒక విధంగా చెప్పాలంటే పెద్దదిక్కుగా ఉండాలి. ఆ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు కు పరిష్కార మార్గం చూపాలి. కానీ ఎందుకో ఆయన జగన్ వైపు మాత్రమే ఉండిపోయారు. అది షర్మిల కు రుచించడం లేదు.అక్కడ పరిష్కార మార్గం దొరకడం లేదు.ఇక కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు షర్మిల. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామంది వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులు. వారికి షర్మిల తో పాటు జగన్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. వారంతా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించిన వారే. అయినా సరే ఆ కుటుంబంలో రేగిన వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేయకపోవడం విశేషం.