Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి ఏమైంది? ఇటీవల ఆయన పెద్దగా కనిపించడం లేదు ఎందుకు? అనారోగ్యానికి గురయ్యారా? ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం దీనిపైనే ప్రచారం సాగుతోంది. గత కొన్నాళ్లుగా కొడాలి నాని బయటకు కనిపించకపోవడం వాస్తవమే. దీంతో ఆయన అనారోగ్యానికి గురైనట్టు ప్రచారం ఊపందుకుంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారమే ఒకటి జరిగింది. గత నవంబరులో కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల పాటు వైద్య చికిత్సలు పొంది తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అటువంటి ప్రచారమే జరుగుతుండడంతో అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
నిత్యం పొలిటికల్ గా నాని యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వంపై కానీ.. అధినేతపై కానీ ఈగ వాలనివ్వరు. ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటారు. కానీ కొన్నిరోజులుగా ఆయన కనిపించడం లేదు. అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని.. అందుకే కనిపించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక ముందుకు అడుగువేసి అనారోగ్యంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెబుతారని.. గుడివాడ నుంచి ఆయన సోదరుడు కుమారుడ్ని బరిలో దింపుతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఇది ఉత్త ప్రచారమా? నిజమా అన్నది తేలాల్సి ఉంది.
అయితే కొడాలి నానిపై ప్రచారంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడికి ఏమైందని ఆరాతీస్తున్నారు. దీనిపై పార్టీ నుంచి ఒక ప్రకటన చేయాలని కోరుతున్నారు. గతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఆయన అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడ్డారు. చివరకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తేలడంతో లేజర్ చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటిదే అయి ఉంటుందని.. కానీ సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం నడుస్తోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని కోరుతున్నాయి.