AP Government
AP Govt : ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. చివరికి కూటమి నాయకులు ఏకపక్ష విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీకి ఈసారి 11 మాత్రమే మిగిల్చి.. ఏకంగా 164 సీట్లను కూటమి నాయకులు దక్కించుకున్నారు. ప్రజలు ఇచ్చిన బంపర్ మెజారిటీని తాము సక్రమంగా వినియోగించుకుంటామని.. సుపరిపాలన అందిస్తామని ఫలితాల అనంతరం కూటమి నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎన్ఐటి, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం వెసలు బాటు కల్పించింది. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులు ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్టులు చదివితే సరిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే కచ్చితంగా ఇంటర్ స్థాయిలో ఐదు సబ్జెక్టులు చదివి ఉండాలి. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదవడంతో దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో నారా లోకేష్ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ వెంటనే కల్పించుకొని ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. ఆ తర్వాత విద్యార్థులు 5 సబ్జెక్టులు చదివినట్టు మెమోలు రూపొందించింది.. అనంతరం వాటిని విద్యార్థులకు అందించి ప్రవేశాలు పొందేలా చేసింది. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
ఇక ఈ నిర్ణయంతో పాటు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పింఛన్లను పెంచింది. ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు అందించే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక పథకానికి శ్రీకారం చుట్టింది. 70 వేల కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడిని సాధించింది. దీనిద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందింది. విజయవాడ నగరంలో తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం ద్వారా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ల పంపిణీ మొదలుపెట్టింది. ధరలు మండిపోతున్న క్రమంలో బియ్యం రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది. అంతేకాదు కందిపప్పును కూడా తక్కువ ధరకే లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది.. ఈ వివరాలను ప్రకటిస్తూ ట్విట్టర్ ఎక్స్ లో టిడిపి ఒక ట్వీట్ చేసింది.
కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉచిత ఇసుక పథకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలను మొదలుపెట్టింది. “ఉచిత ఇసుక పేరుతో దోపిడీ మొదలుపెట్టారు. టన్ను ఇసుకకు అంత చెల్లించాల్సిన అవసరం ఏంటి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట చెప్పి.. ఇప్పుడు మాట మార్చుతోందని” వైసిపి నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఎలా దోపిడీ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని టిడిపి నాయకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.. అయితే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. “టమాట ధరలు ఘోరంగా పెరిగాయి. ఇతర నిత్యావసరాలు కూడా భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ధరలు దిగివచ్చాయి. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అనుకోలేదని” సామాన్యులు చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పింది. అందులో ఉచిత ఇసుక ఒకటి. ఈ పథకం ప్రస్తుతం అమలౌతున్న నేపథ్యంలో.. ఇక మిగతా వాటిని కూడా లైన్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చదువుకునే పిల్లలకు విద్యా కానుక, ఉపకార వేతనాల పంపిణీ.. వంటి హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. పింఛన్ల పంపిణీ సంబంధించి ప్రభుత్వం గత బకాయిలను కూడా కలిపి ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోందని టిడిపి నాయకులు అంటున్నారు..”గత వైసిపి ప్రభుత్వం పింఛన్ల పెంపు సరిగ్గా చేపట్టలేదు. అందువల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయిలతో కలిపి పింఛన్లు ఇచ్చింది. ఇది సాహసోపేతమైన నిర్ణయమని” టిడిపి నాయకులు అంటున్నారు..
కూటమి ప్రభుత్వం నెలరోజుల పరిపాలన పై వైసిపి నాయకులు పెదవి విరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, తెలంగాణకు మొత్తం అప్పజెప్పి వచ్చారని విమర్శిస్తున్నారు. ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచారని ఆరోపిస్తున్నారు. “జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయి. కూటమి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు ప్రారంభమయ్యాయి. ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని” వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What did the alliance government achieve in ap in 30 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com