Pawan Kalyan – Amit Shah : అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటిలో అసలేం చర్చించారు?

చంద్రబాబును చేరదీయ్యాలని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇటు పవన్ రిక్వెస్ట్, అటు జాతీయ స్థాయి అవసరాల దృష్ట్యా ఏపీలో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ. 

Written By: Dharma, Updated On : July 20, 2023 10:40 am
Follow us on

Pawan Kalyan – Amit Shah : ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ పునరాలోచనలో పడిందా? పవన్ విడమరచి చెప్పడంతో మనసు మార్చుకోనుందా? వైసీపీ విముక్త ఏపీయే తన ముందున్న లక్ష్యంగా జనసేనాని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన పవన్ బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించారు. పవన్ వెంట పార్టీ నేత నాదేండ్ల మనోహర్ సైతం ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి నడిస్తేనే వైసీపీని ఓడించగలమని పవన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నడుస్తాయని సూచనప్రాయంగా తెలిపారు. అయితే టీడీపీతో కలిసి వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదు. అయితే మూడు పార్టీలు కలిసి వెళితేనే ప్రయోజనమని.. జగన్ ను సునాయాసంగా ఓడించవచ్చని పవన్ ఢిల్లీ పెద్దలను ఒప్పించారు. దీంతో వారు కొంత మెత్తబడినట్టు సమాచారం. ఢిల్లీ పెద్దలను కలిసిన తరువాత పవన్ ఒక ట్విట్ చేశారు. పెద్దలను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. మా కలయిక ఏపీ ప్రజల భవితకు ప్రయోజనం చేకూర్చుతుందని ట్విట్ చేయడంతో పొత్తుల విషయమే అని అర్ధమవుతోంది.

వైసీపీ సర్కారు తీరుపై పవన్ ఆగ్రహంగా ఉన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎలాగైన వైసీపీని సాగనంపాలని తీర్మానించుకున్నారు. ఒక వేళ బీజేపీ, జనసేన కలిసి టీడీపీ విడిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని.. తద్వారా వైసీపీ మరోసారి గెలుస్తుందని.. అదే జరిగితే జనసేన, బీజేపీలకు కలిగే నష్టాన్ని ఒక నివేదిక రూపంలో పవన్ అందించినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడినట్టు సమాచారం.

మరోవైపు దేశంలో విపక్ష ‘ఇండియా’ కూటమి స్పీడు పెంచుతున్న వేళ భాగస్వామ్య పక్షాలను పెంచుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే 91 మంది ఎంపీలు కలిగిన పార్టీలు తటస్థంగా ఉన్నాయి. వీటిలో కొన్ని విపక్ష కూటమిపై మొగ్గుచూపినా నష్టం తప్పదని హైకమాండ్ భయపడుతోంది. పోనీ ఈ లెక్కనైనా చంద్రబాబును చేరదీయ్యాలని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇటు పవన్ రిక్వెస్ట్, అటు జాతీయ స్థాయి అవసరాల దృష్ట్యా ఏపీలో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.