Rayapati Aruna – Nagababu : ఇప్పుడిప్పుడే జనసేన గాడిలో పడుతోంది. తన వెనుక అంతులేని శక్తి ఉన్నా అచేతనుడుగా నిలవడం వెనుక లోపాలు పవన్ కు తెలియంది కాదు. కేవలం సిద్ధాంతపరంగానే రాజకీయాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ ముందడుగు వేస్తున్నారు. సీట్లు, ఓట్ల రాజకీయం ఏనాడు చేయలేదు.. చేయనని చెబుతున్నారు కూడా. అందుకే పార్టీని సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. పవనన్నకు జైకొడతాం.. జగనన్నకు ఓటు వేస్తాం అన్న బ్యాచ్ ను దూరం పెడుతున్నారు. అయినా ఎక్కడో ఓ చోట సమస్య వస్తూనే ఉంది. తాజాగా రాయపాటి అరుణ రూపంలో వివాదం వచ్చిపడింది. జనసేన సైనికులు, చిరంజీవి అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది.
జనసేన అధికార ప్రతినిధిగా రాయపాటి అరుణ ఉన్నారు. మంచి వాగ్ధాటి ఉన్న మహిళా నేత. తరచూ టీవీ డిబేట్లకు హాజరవుతుంటారు. దూకుడుగా సమాధానాలు చెబుతుంటారు. అయితే ఒక్కోసారి ఫైరయ్యే క్రమంలో నోరు జారుతుంటారు. ఇటీవల ఓ టీవీ డిబేట్ లో అలానే టంగ్ స్లిప్ అయ్యారు. అయితే అది రాజకీయ ప్రత్యర్థులపై అయితే పర్వాలేకున్నా.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కామెంట్స్ చేశారు. జనసేనకు ఓట్లు రాకపోవడానికి కారణాన్ని విశ్లేషించే క్రమంలో అది చిరంజీవి తప్పిదంగా అరుణ పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినందు వల్లే ప్రజల్లో నమ్మకం కోల్పోయారని.. ఆ ప్రభావం జనసేనపై పడిందని చెప్పుకొచ్చారు.
అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో జన సైనికులు వైరి వర్గాలుగా విడిపోయారు. చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా అందరూ లైన్ లోకి వచ్చి అరుణ తీరును తప్పుపడుతున్నారు. మెగా పవర్ స్టార్స్ సోషల్ మీడియాకు పనిచేసే శివ అనే వ్యక్తి కొత్తగా పోస్టు పెట్టారు. రాయపాటి అరుణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు చిరంజీవి అభిమానులు సైతం ఆమెపై విరుచుకు పడడంతో వివాదం ముదురుతోంది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. రాయపాటి అరుణపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చిరు అభిమానులకు సూచించారు. ఏదో ఫ్లో వచ్చిన దానిని పెద్దది చేయవద్దని కోరారు. దీంతో వివాదం ముగిసింది.
జన సైనికులు, మెగా అభిమానులు వేరుకాదు. ఇప్పుడంతా ఒక్కటిగా కనిపిస్తున్నారు. ఇటువంటి సమయంలో తాజా వివాదం నెలకొనడంతో హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ వాల్ కు సంబంధించి అభిమానులు ఒక తాటిపైకి రాలేదు. చివరకు పవన్ ఫ్యాన్స్ సైతం ఓటర్లుగా మారలేదు. చాలా సందర్భాల్లో పవన్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఎన్నడూ లేనంతగా ఈసారి అభిమానులు స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా మద్దతు నిలవాలని భావిస్తున్నారు. ఈ సమయంలో ఇటువంటి వివాదాలు నష్టం చేసే చాన్స్ ఉంది. మున్ముందు ఇలాంటివి తలెత్తకుండా చూడాలని జనసైనికులు హైకమాండ్ కు కోరుతున్నారు.