Prajagalam Sabha: సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు ఒకే వేదిక పైకి వచ్చారు. వీరిద్దరికీ పవన్ జత కలిశారు. ముగ్గురు నాయకులు ఒకే వేదిక పైకి రావడంతో మూడు పార్టీల శ్రేణులు ఆనందంతో ఉబ్బితబిబ్బయ్యాయి. చిలకలూరిపేట సమీపంలో మూడు పార్టీలు ప్రజాగళం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో సైతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు సంయుక్తంగా ఎన్నికల ప్రచార సభను ప్రారంభించాయి. మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీగా జనాలు తరలివచ్చారు.
ప్రధాని మోదీ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏకు ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. 400 సీట్లు దాటాలని కోరారు. ఇందుకు నా ఆంధ్ర కుటుంబ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన ఏపీని చూడాలనుకుంటే ఎన్డీఏకు 400కు పైగా సీట్లు రావాలని.. అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకొని ముందుకు సాగే సత్తా ఉందన్నారు. కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీల బలం కూడా పెరగాలని.. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలని.. అప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
అటు చంద్రబాబు మాట్లాడుతూ 5 కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఈ సభతో ప్రారంభమవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని తేల్చి చెప్పారు. ప్రజల ఆశలను ఆకాంక్షలను సహకారం చేసే సభగా అభివర్ణించారు. ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసం పెచ్చు మీరిందని.. అన్ని వ్యవస్థలు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. మా జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే నన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజల కోసం పరితపించే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ వ్యక్తి కాదు.. ఈ దేశానికి ఒక విశ్వ గురువుగా అభివర్ణించారు. మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంగా చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలతో ఈ దేశ సమగ్ర అభివృద్ధికి బీజం వేశారని చెప్పారు. ఈ రాష్ట్రం కోసమే ఎన్డీఏలో మరోసారి భాగస్వామ్యం అయ్యామంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలను ఎన్డీఏకు కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతికి అండగా ఉండేందుకు ప్రధాని మోదీ ఏపీకి వచ్చారని.. అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారిగా మారారని కామెంట్ చేశారు. దేశమంతా డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే.. ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈరోజు మైనస్ 3 శాతానికి దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నారని.. కానీ ఎన్డీఏ కూటమిదే గెలుపు అని తేల్చి చెప్పారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మొత్తానికైతే తొలి సభలోనే ముగ్గురు నేతలు వైసీపీ సర్కార్ పై విరుచుకు పడడం విశేషం.