Chandrababu Govt 100 days Ruling : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ప్రజలకు సుపరిపాలన అందించాము కనుక సంబరాలు చేసుకోవాలని భావిస్తోంది. మూడు పార్టీలు ఉమ్మడిగా సంబరాలకు పిలుపునిచ్చాయి. మరోవైపు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో వైసీపీ కూడా 100 రోజుల పాలనపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. వారు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి పరస్పరం వాదనలు ఆడుకోవడం సహజం. అయితే వాస్తవ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సామాజిక పింఛన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచింది. గత మూడు నెలలుగా అందించింది.పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 12,500 కోట్ల రూపాయలను సాధించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు మంజూరయ్యేలా చేసింది.
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం వల్ల తమ భూములు, స్థలాలను ప్రభుత్వం లాగేసుకుంటుందన్న అనుమానం ప్రజల్లో పెరిగింది. ప్రతిపక్షాలు సైతం వీటినే ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
* అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. 16 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనిపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంకా సన్నాహాలు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
* సామాజిక పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచారు. 3000 వరకు ఉన్న పింఛన్ ను.. వెయ్యి పెంచుతూ గత మూడు నెలలుగా అందించారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల బకాయిలను సైతం అందించగలిగారు
* గత ప్రభుత్వానికి ఎక్కువగా చెడ్డ పేరు వచ్చింది ఇసుక విధానంలో.. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పాలసీని ప్రకటించారు. ఇసుక ధరను తగ్గించారు. కేవలం రవాణా చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నారు.
* అమరావతి రాజధాని నిర్మాణానికి కదలిక వచ్చింది. వైసిపి ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త శోభ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది.
* ఆంధ్రుల జీవనాడిగా పేరుపొందింది పోలవరం ప్రాజెక్ట్. గత ఐదేళ్ల వైసిపి పాలనలో కేంద్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి దశ నిర్మాణానికి 12,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
* దాదాపు గ్రామీణాభివృద్ధికి సంబంధించి శాఖలన్నీ పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆయన స్థానిక సంస్థలకు పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు. ప్రపంచ రికార్డును పొందారు.
* రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. దాదాపు 200 వరకు క్యాంటీన్లను తెరిచి పేదలకు మూడు పూటల ఆహారాన్ని అందిస్తున్నారు.
* విజయవాడకు భారీగా వరదలు ముంచెత్తాయి. బుడమేరు పొంగి ప్రవహించడంతో లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ వరద సహాయ చర్యలను పర్యవేక్షించారు. విజయవాడ నగరంలోని మెజారిటీ ప్రజలు ప్రభుత్వ సహాయ చర్యలు, పునరావాసం పై సంతృప్తి వ్యక్తం చేశారు.
* టిడిపి, వైసిపి మధ్య వార్
అయితే వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా ‘మంచి ప్రభుత్వం’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే దీనిపై వైసీపీ పెదవి విరుస్తోంది. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నవరత్నాలను ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం వాటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో జగన్ 100 రోజుల పాలనలో చేసిన పనులను గుర్తు చేసుకుంటే.. సామాజిక పింఛన్లను 250 రూపాయలు పెంపు, రివర్స్ టెండరింగ్, ప్రజా వేదిక కూల్చివేత, గ్రామ వాలంటీర్ల నియామకం వంటి పనులు చేపట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే అటు వైసిపి, ఇప్పుడు టిడిపి సమాన స్థాయిలోనే పనులు చేశాయని ప్రజల నుంచి వినిపిస్తోంది. అయితే పరస్పరం ఆ రెండు పార్టీలు ఇప్పుడు వాదులు ఆడుకుంటున్నాయి. వంద రోజుల పాలన లో మెరుగైన ఫలితాలు సాధించామని టిడిపి కూటమి చెబుతోంది. కానీ వైఫల్యాలే కనిపిస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More