Jagan And Sharmila: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు ఉంది ఏపీలో ఇప్పుడు పరిస్థితి. వైఎస్ షర్మిల ఏం మాట్లాడినా వార్తే. ఏం చేసినా సంచలనమే. అంతలా పరిస్థితి మారిపోయింది. ఆమె ఏపీ సీఎం జగన్ కు సోదరి కావడం, ఆయనతో విభేదించడం, రాజకీయ మార్గంలో వ్యతిరేకంగా ప్రయాణించడమే అందుకు కారణం. అందుకే ఆమె చేసిన ప్రతి చర్యను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రాధాన్యమిస్తోంది. ఎనలేని ప్రాచుర్యం కల్పిస్తోంది. అది వారికి అవసరం. జగన్ ను తక్కువ చేసి చూపించడం వారికి అనివార్యం.
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అచేతనంగా ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. అయినా సరే జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉంది. గత ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్షులుగా రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, రుద్రరాజు పదవి బాధ్యతలు చేపట్టారు. మీడియా పరంగా వారికి ప్రాధాన్యం అంతంత మాత్రమే. జగన్ పై ఏ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఎల్లో మీడియాలో, చంద్రబాబును వ్యతిరేకిస్తే నీలి మీడియాలో ప్రాధాన్యం లభించేది. అంతకుమించి కవరేజ్ దక్కేది కాదు. కానీ షర్మిల విషయంలో అలా కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక మునుపే ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది.
షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో జరిగిన పరిణామాలను కూడా మీడియాలో అతిగా చూపించడం విశేషం. కచ్చితంగా జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయి. అందుకే ఆమె అన్నకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వారి మధ్య మాటలు లేవని… పలకరింపుల్లో కూడా కృత్రిమ నవ్వులు ఉంటాయని.. జగన్ తో ఫోటోలు దిగేందుకు కూడా షర్మిల ఇష్టపడడం లేదని లేనిపోని ప్రచారాన్ని కల్పిస్తూ మీడియాలో కథనాలు వార్చారు. వారంతా రక్తసంబంధీకులు. పైగా మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ కచ్చితంగా హాజరవుతారు. అందులో అంత ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఏవేవో జరిగినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు అన్నవి వాస్తవం. కానీ దాని గురించి జగన్ చెప్పరు.. షర్మిల సైతం నోరు విప్పరు. కానీ ఇద్దరి మధ్య అగాధం ఉందని మాత్రం చెప్పే ప్రయత్నం మీడియా తీసుకుంది. ముఖ్యంగా ఎల్లో మీడియా తన పరిధికి మించి వ్యవహరిస్తోంది. ఇకనుంచి పీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల ఏం చేసినా వార్తే. ఆమెకు పవన్ కళ్యాణ్ కు మించి కవరేజ్ ఇస్తారనడంలో సందేహం లేదు.