Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? బయటకు ప్రకటించరు ఎందుకు? శాంతి భద్రతల సమస్యలు వస్తాయనా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి జరిగింది. వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేశాయి. దీని వెనుక వల్లభనేని వంశీ ప్రోత్సాహం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై టిడిపి శ్రేణులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తిరిగి టిడిపి శ్రేణులపైనే కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్ళి ఆరా తీశాయి. కానీ వల్లభనేని వంశీ ఆచూకీ తెలియలేదు. కానీ నిన్న మాత్రం అరెస్టు చేశారని రోజంతా ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారని మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా పోలీసులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వంశీ అరెస్టు విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఆయన ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరో అనుచరుడు రమేష్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వంశీ అరెస్టయ్యారని.. ఆయన పేరు ప్రకటిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని తెలిసి.. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నారు.
* తరచూ అనుచిత వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు వల్లభనేని వంశీ. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీలోకి ఫిరాయించారు. ఇలా వెళ్లిన వంశీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. వారిపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై సైతం వ్యక్తిగత కామెంట్స్ చేశారు. అప్పటినుంచి టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాయి.
* ఈ ఎన్నికల్లో భారీ ఓటమి
ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అందరి దృష్టి వల్లభనేని వంశీ పై పడింది. ఆయనను వీలైనంత త్వరగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని టిడిపి శ్రేణులు కోరుకున్నాయి. కానీ ప్రభుత్వం అటువంటిదేమీ ప్రారంభించలేదు. అయితే తాజాగా కొత్త ఎస్పీ రావడంతో టిడిపి కార్యాలయం పై దాడి మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసులు అరెస్టులు సైతం ప్రారంభించారు. నిన్నటి వరకు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న వంశీ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. హైదరాబాద్ వెళ్లారు. కానీ ఆచూకీ చిక్కలేదు. అయితే గన్నవరం సమీపంలో కారులో వెళుతుండగా గుర్తించిన పోలీసులు వెంబడించినట్లు తెలుస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు కూడా ప్రచారం జరిగింది.
* అమెరికాకు పయనం
వాస్తవానికి పోలింగ్ ముగిసిన వెంటనే వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి తిరిగి రారు అని కూడా ప్రచారం జరిగింది. సరిగ్గాకౌంటింగ్ ముందు రోజున అమెరికా నుండి వచ్చారు వంశీ. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖం చాటేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో హైదరాబాదు నుండి అమెరికాకు వంశీ వెళ్ళిపోయి ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయన హైదరాబాదులో ఉన్నట్లు అనుచరుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీంతో వంశీ స్థానికంగా ఉన్నట్లు భావించి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో ఆయన ఆచూకీ లభ్యమైనట్టు, పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని తాజాగా పోలీసులు చెబుతుండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More