Vijayasai Reddy
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ప్రతిష్టను సొంత పార్టీ నేతలు డ్యామేజ్ చేస్తున్నారా? మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా? ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? ఆయనపై తాజా ఆరోపణల వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ఓ మహిళా అధికారిపై ఆయన భర్త చేసినఆరోపణల నేపథ్యంలో.. విజయసాయిరెడ్డి ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో సైతం విస్తృత చర్చకు కారణమైంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
వైసీపీలో నెంబర్ 2గా ఏదిగారు విజయసాయిరెడ్డి. ఆ స్థానానికిచాలా పెద్ద పోటీ ఉంది. వైసిపి ఆవిర్భావ సమయంలో నెంబర్ 2 గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. తెలంగాణకు చెందిన గోనె ప్రకాష్ రావు, కొండా సురేఖ సైతం జగన్ ను అనుసరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వైసీపీలో నెంబర్ 2 స్థానం మారిపోతూ వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటికి విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి.. ఆ స్థానానికి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎనలేని ప్రాధాన్యత దక్కించుకున్నారు. జగన్ సైతం సకల శాఖలను ఆయనకే అప్పగించారు. చివరకు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని తన బాబాయి వైవి సుబ్బారెడ్డి కి అప్పగించారు. సోషల్ మీడియా విభాగం నుంచి సైతం తప్పించారు. ఆ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు. అయితే పార్టీలో జరిగిన ఈ పరిణామాలతో కొద్దిరోజుల పాటు విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు.
నందమూరి తారకరత్న మరణంతో చంద్రబాబు, బాలకృష్ణ లను విజయసాయిరెడ్డి కలవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి మరదలు కుమార్తె అలేఖ్య రెడ్డి తారకరత్న భార్య. తారకరత్న మరణంతో వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డి పై ఏర్పడింది. తారకరత్న నందమూరి కుటుంబ సభ్యుడు కావడంతో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో సన్నిహితంగా గడిపారు విజయసాయిరెడ్డి. దీంతో అప్పట్లో ఒక ప్రచారం బలంగా జరిగింది. వైసిపి శ్రేణులు సైతం విజయ సాయి రెడ్డిని అనుమానంగా చూశాయి. కానీ క్రమేపి ఆ అనుమానాలు తగ్గాయి. తిరిగి విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. నెల్లూరులో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోవడంతో.. జగన్ విజయసాయిరెడ్డి ని ఆశ్రయించాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓటమి గ్యారెంటీ అని తెలిసినా తనను ప్రయోగించడం పై విజయసాయిరెడ్డి కూడా బాధపడినట్లు తెలుస్తోంది. అందుకే ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
అయితే తాజాగా ఓ మహిళ అధికారి గర్భం విషయంలో తన పేరు బయటకు రావడానికి విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులతోపాటు తనతో గిట్టని సొంత పార్టీ వారిపై సైతం అనుమానం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారే టిడిపితో కుమ్మక్కై ఈ కుట్రకు తెర లేపారని ఆయన మీడియా ముందు ఓపెన్ కావడం గమనార్హం. సదరు మహిళా అధికారి వైసిపి నాయకుల సిఫారసులకు పెద్దపీట వేస్తారన్న విమర్శలు ఉన్నాయి. వైసిపి హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసిపి పెద్దలతో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పని గట్టుకొని విజయసాయి రెడ్డి పై ఆరోపణలు రావడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Was vijayasai reddy damaged by his own party leaders