Iconic Bridge Vijayawada: ఏపీ ప్రభుత్వం( AP government) ప్రజాభాగస్వామ్యంతో ఒక నిర్ణయం తీసుకోనుంది. దీనికిగాను ఓటింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఓ అద్భుతమైన వంతెన నిర్మించబోతోంది. అమరావతి- విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండే ఈ వంతెన రూపకల్పన కోసం నాలుగు ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేశారు. అయితే దీనిలో ఒక్కదానిని ఫైనలైజ్ చేసేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సిఆర్డిఏ వెబ్సైట్లో ఓటు వేసి ఈ చారిత్రాత్మక నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావచ్చు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచనలు చేస్తోంది. అందుకే కృష్ణా నదిపై ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించి విజయవాడ, గుంటూరు, అమరావతి నగరాలకు ఒక కొత్త శోభ తీసుకురావాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నేషనల్ హైవే ను అనుసంధానం చేస్తుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఐకానిక్ వంతెన కోసం నాలుగు డిజైన్లను ఎంపిక చేశారు.
* సిఆర్డిఏ వెబ్ సైట్ లో..
సిఆర్డిఏ( crda) వెబ్సైట్లో ఈ నాలుగు డిజైన్లు ఉన్నాయి. ఏదో ఒక డిజైన్ కు మనం ఓటు వేయవచ్చు. రాష్ట్ర నృత్యం గా ఉన్న కూచిపూడి, అమరావతిని గుర్తుకు తెచ్చేలా ఈ డిజైన్ చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. రాయపూడి నుంచి మూలపాడు వరకు ఈ వంతెన కొనసాగనుంది. ప్రత్యేక ఆర్కిటెక్ట్లతో డిజైన్ రూపొందించారు. మూడు డిజైన్లు కూచిపూడి నృత్యాన్ని ప్రతిబింబించేలా తయారు చేశారు. మరొకటి అమరావతి గుర్తుగా ఆంగ్ల అక్షరం A ఆకారంలో ఉండేలా తయారు చేశారు. సి ఆర్ డి ఏ వెబ్సైట్లో ఉన్న ఈ నాలుగు డిజైన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
* ఇలా చేయాలి..
సిఆర్డిఏ వెబ్సైట్లో ఈ నాలుగు డిజైన్లు ఉంటాయి. అందులో ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న తర్వాత క్యాప్చా ( capture) ఎంటర్ చేసి ఓకే చేయాలి. అప్పుడు మనం ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కృష్ణా నదిపై నిర్మించబోయే అందమైన ఐకానిక్ వంతెనకు సంబంధించి డిజైన్ల ఎంపికలు మనము భాగస్వాములు అయినట్టు అవుతుంది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానికి సమాంతరంగా విజయవాడ సమీపంలో కృష్ణా నదిపై ఈ ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారుల సంస్థ ఈ వంతెన నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తోంది. దీంతో వీలైనంత త్వరగా ఈ మధ్యలో పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. డిజైన్ల ఎంపిక జరిగిన తరువాత టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.