AP Elections 2024: ఏపీలో పెరగనున్న ఓటింగ్ శాతం.. ఎవరికి ప్రయోజనం?

2019 ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి అంతకంటే ఎక్కువ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక సీఎం జగన్ దంపతులు పులివెందులలో ఓటు వేశారు.

Written By: Dharma, Updated On : May 13, 2024 1:01 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో ఓటు చైతన్యం పెరిగింది. ఓటు వేసేందుకు ఓటర్లు ఎగబడుతున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభ సమయానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ప్రజలు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. తొలి రెండు గంటల్లోనే 10 శాతం ఓటింగ్ పూర్తయింది. 2019 ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అయితే పోలింగ్ పెరిగిన క్రమంలో ఎవరికి కలిసి వస్తుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ ప్రారంభ సమయంలోనే చెదురు మదురు ఘటనలు చోటు చేసుకోవడం విశేషం.

2019 ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి అంతకంటే ఎక్కువ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక సీఎం జగన్ దంపతులు పులివెందులలో ఓటు వేశారు. చంద్రబాబు దంపతులు మంగళగిరి నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పవన్ దంపతులు సైతం మంగళగిరి పరిధిలోనే ఓటు వేయడం విశేషం.

అయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన 10 లక్షల మంది యువత తొలిసారిగా ఓటు వేస్తున్నారు. ఓటు వేయడానికి యువత ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఇది ఎవరికి నష్టం జరుగుతుందో తెలియాలి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదన్న ఆరోపణ ఉంది. పరిశ్రమల ఏర్పాటు చేయలేదన్న విమర్శ ఉంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగలేదన్న ఆరోపణల క్రమంలో యువత ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మహిళలు సైతం పెద్ద ఎత్తున ఓటు వేస్తుండడంతో తమకు కలిసి వస్తుందని వైసిపి అంచనా వేస్తోంది. కాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు మృతి చెందింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లలో యంత్రాంగం విఫలం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఉదయం 10 గంటల సమయానికి అనంతపురం జిల్లాలో 9.18%, ఏలూరులో 10%, పిఠాపురంలో 10%, కృష్ణాజిల్లాలో 10.8%, కడపలో 12%, సత్య సాయి జిల్లాలో 6.92%, తిరుపతిలో 8.11% ఓటింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అర్బన్ ప్రాంతాల్లో యువత, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం విశేషం.