Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరు సిద్ధం అంటుంటే.. మరొకరు కుర్చీ మడత పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో తాజాగా జరిగిన ఓ రాజకీయ పరిణామం అక్కడ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కోర్టులో ఫిర్యాదు చేయడం.. దానికి సంబంధించి కేసు నమోదు కావడంతో విచారణకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం నోటీసులు పంపింది. న్యాయస్థానం పంపిన నోటీసుల ప్రకారం పవన్ కళ్యాణ్ మార్చి నెలలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
గత ఏడాది జూలై నెలలో ఏపీలో జరిగిన సభలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అమ్మాయిలు అదృశ్యం అవ్వడానికి వలంటీర్లే కారణమని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన మరుసటి రోజు నేషనల్ క్రై* రికార్డ్స్ బ్యూరో అదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో ఏపీ ప్రభుత్వం కొంతమంది వలంటీర్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయించింది. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయించింది. కోర్టుల్లోనూ వాజ్యాలు దాఖలు చేయించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం ఆయనను విచారణకు హాజరుకావాలని నోటీసు పంపింది. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని కోర్టు పవన్ కళ్యాణ్ ను కోరింది. ఈ మేరకు నోటీసులు కూడా పంపింది. దీనిపై జనసేన నాయకులు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎన్నికల సమయంలో రాజకీయంగా అణగదొక్కడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ఎన్ని విచారణలకైనా పవన్ కళ్యాణ్ హాజరవుతారని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు పంపిన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదని, ఇంకా చాలామందికి కోర్టు ద్వారా ఏపీ ప్రభుత్వం నోటీసులు పంపిస్తుందని జనసేన నాయకులు అంటున్నారు. కోర్టు పంపించిన నోటీస్ పై ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.