Homeఆంధ్రప్రదేశ్‌TTD Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. స్వామీజీలు స్పందిస్తున్నా.. శారదా పీఠాధిపతి ఎక్కడ?

TTD Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. స్వామీజీలు స్పందిస్తున్నా.. శారదా పీఠాధిపతి ఎక్కడ?

TTD Laddu Issue : తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో వైసీపీ అడ్డంగా బుక్కైయిందా? ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అందుకే న్యాయస్థానం బాట పట్టిందా? హిందూ వ్యతిరేకతను మూటగట్టుకోనుందా? అదును చూసి టిడిపి కూటమి ప్రభుత్వం దెబ్బ కొట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీకి అండగా ఏ ధార్మిక సంఘం కానీ, ఆధ్యాత్మిక వేత్తలు కానీ అండగా నిలిచే పరిస్థితి లేదు. వైసిపి హయాంలో సనాతన ధర్మంపై కుట్రలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసిపి హయాంలో టీటీడీ వ్యవహారాలు, ఇతర దేవస్థానాల్లో వివాదాలు వెలుగు చూసినప్పుడు.. కొందరు ధార్మికవేత్తలు, స్వామీజీలు అండగా నిలిచేవారు. ఇప్పుడు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతుగా నిలవడానికి ముందుకు రావడం లేదు.

* జాతీయస్థాయిలో ఆగ్రహ జ్వాల
అయితే ఈ విషయంలో జాతీయస్థాయిలో ఉద్యమం ఎగసిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదం పై రామ జన్మభూమి ట్రస్ట్ రియాక్ట్ అయ్యింది. ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చూడాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఘటనగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ కుట్ర? లేకుంటే దేశంలోనే జరిగిందా? అనే దానిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

* రమణ దీక్షితుల స్పందన
మరోవైపు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సైతం స్పందించారు. ప్రసాదాల నాణ్యత విషయంలో ఎన్నోసార్లు చైర్మన్, ఈవో దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. శ్రీవారి ప్రసాదాలను జంతువు నూనెను వినియోగించడం అపచారం అన్నారు. గత ఐదేళ్లుగా ఈ మహా పాపం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. తాను సైతం ల్యాబ్ రిపోర్టు చూశానని.. జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలింది అన్నారు. కాగా 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో రమణ దీక్షితులు హవా కొనసాగింది. 2021లో ఆయనకు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించింది ప్రభుత్వం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు అదే పదవిలో ఆయన కొనసాగారు. ఇప్పుడు ఆయనేఈ ఆరోపణలు చేస్తుండడం విశేషం.

* స్పందించని విశాఖ శారదా పీఠాధిపతి
అయితే ఇంత రాద్ధాంతం జరుగుతున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. వైసిపి హయాంలో ఈ స్వామిదే హవా. నిత్యం ఈ స్వామివారి సేవలో జగన్ ఉండేవారు. స్వామీజీ సైతం జగన్ కోసం పరితపించేవారు. స్వరూపానంద స్వామి తిరుమల వచ్చారంటే అధికారుల సైతం హడలెత్తిపోయేవారు. తిరుమలలో మార్పులు, చేర్పులు అంతా స్వామి వారి ఆదేశాలతో జరిగేవి. అటువంటి స్వామీజీ ఇప్పుడు మౌనం పాటించడం రకరకాల చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular