Visakhapatnam Yoga Preparations 2025 : యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ నగరం( Visakhapatnam) సిద్ధం అయ్యింది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానుండడంతో అందరి దృష్టి విశాఖపై పడింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చారు ప్రధాని మోదీ. ఆ సమయంలోనే విశాఖ యోగా దినోత్సవం వేడుకలకు రానున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి యోగా అనేది భారతదేశానికి చెందినది. ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈసారి యోగా దినోత్సవం నాడు తాను విశాఖ వస్తానని ప్రధాని మోదీ చెప్పడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని హాజరయ్యే యోగా దినోత్సవ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆరోజు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేసి ప్రపంచం చూపు విశాఖపై పడేలా సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. అందుకే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
విశాఖలోని ఆర్కే బీచ్( RK Beach ) నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 127 కంపార్ట్మెంట్లలో యోగ ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్ 200×14 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్ మెంట్ లో వెయ్యి మంది చొప్పున పాల్గొనున్నారు. ప్రతి సెక్షన్కు ఒక ఇంచార్జ్, వైద్య సిబ్బంది, పదిమంది వాలంటీర్లు ఉంటారు. ఎల్ఈడి స్క్రీన్లు, మైకులు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టంతో పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగ సంఘాల సభ్యులు, నేవీ కోస్టల్ గార్డ్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
Also Read: Visakhapatnam Yoga Day2025 : యోగా డే కోసం విశాఖనే మోడీ ఎందుకు ఎంచుకున్నారు? దీని ప్రత్యేకతలేంటి?
ఎన్నెన్నో ప్రత్యేకతలు
విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి( yoga day) ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచ రికార్డులకు సైతం ఈ కార్యక్రమం చేరువ కానుంది. మొత్తం 22 రికార్డులను సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెల్తోంది. ఇందులో 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించినవి ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం, ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందితో యోగా చేయడం వంటి రికార్డులపై దృష్టి సారించారు. విశాఖలో యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయించనున్నారు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని నిర్ణయించారు.
Also Read: Yogandhra 2025: మోడీ, చంద్రబాబు, పవన్.. 5 లక్షల మంది.. విశాఖ యోగా డే విశేషాలు ఎన్నో!
ఈరోజు సాయంత్రం ప్రధాని రాక..
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు రానున్నారు. సాయంత్రం 6:40 గంటలకు విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు ఎంపీలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 6:25 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. 6:30 గంటల నుంచి 7:50 గంటల వరకు యోగ విన్యాసాల్లో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పాల్గొనున్నారు. ఐదు లక్షల మంది హాజరు కానున్నారు. మరోవైపు ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణిని ప్రధాని మోదీ పరామర్శించే అవకాశం ఉంది. యోగ డే ముగించుకొని నావెల్ కమాండ్ కు తిరిగి చేరుకునే ప్రధాని మోదీ అక్కడ రిజర్వు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 11:50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ప్రధాని మోదీ.